బెంగళూర్, జనవరి 31, (way2newstv.com)
బీజేపీ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కుతకుతలాడిపోతున్నారు. తాము పదవులను త్యాగం చేసి, పార్టీని వదిలేసుకుని వచ్చినా ఇంతవరకూ మంత్రి వర్గ విస్తరణ జరపకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు బీజేపీ కండువాలు కప్పి యడ్యూరప్ప టిక్కెట్లు కూడా కేటాయించారు.గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనూ యడ్యూరప్ప చెప్పారు. గెలిస్తే చాలనుకున్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు గెలుపు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. పార్టీని మోసం చేశారన్న కాంగ్రెస్, జేడీఎస్ ల ప్రచారాన్ని ఆ ప్రాంత ప్రజలు తిప్పికొట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రిపదవి ఖాయమని భావించారు.
మంత్రి పదవులు ఎప్పుడు
కానీ తీరా గెలిచిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం తమను పట్టించుకోవడం లేదన్న అసహనం వారిలో అడుగడుగునా కన్పిస్తుంది.అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచిన వారిలో కొందరికే మంత్రి పదవులు ఇస్తామని కేంద్ర నాయకత్వం సంకేతాలను పంపింది. దీంతో వారు యడ్యూరప్ప ఎదుట అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన త్యాగాలకు అర్తమేంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని పదవులు వారికిస్తే ఎన్నాళ్ల నుంచో పార్టీలో ఉన్న వారికి ఏం సమాధానం చెప్పాలని బీజేపీ అగ్రనేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.ముఖ్యమైన వారికి కొందరికే విస్తరణలో అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించడంతో యడ్యూరప్ప సయితం ఫీల్ అవుతున్నారు. తన మాటకు, ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోతే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలను ఏం చేయాలని ఆయన వేదన చెందుతున్నారు. మొత్తం మీద మంత్రి వర్గ విస్తరణపై యడ్యూరప్పకు, అధిష్టానానికి మధ్య ఇంకా క్లారిటీ రాలేదు. విస్తరణ మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది