మెదక్, జనవరి 20 (way2newstv.com):
పరిశ్రమల ఖిల్లాగా పేరున్న ఐడీఏ బొల్లారం జల, వాయు కాలుష్యంతో సతమతమౌతోంది. ఇక్కడి ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మూడు దశాబ్దాలుగా పంట భూములు బీళ్లుగా మిగిలిపోయాయి. చెరువులు, కుంటలు, కాలువలు, భూగర్భ జలాలు విషపూరితమయ్యాయి. ఇక్కడి కాలుష్య సమస్యపై న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు సైతం బుట్టదాఖలయ్యాయి. చెరువులు, కుంటలను శుద్ధి చేసి కాలుష్య కారక పరిశ్రమలను కట్టడి చేయాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. నేతల హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాల్సిన పురపాలిక సైతం చోద్యం చూస్తోంది. మరికొన్ని రోజుల్లో పురపాలక ఎన్నికలు పూర్తయి పాలకవర్గం కొలువుదీర నుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పోటీ చేసే వారి నుంచి కాలుష్య నియంత్రణపై స్పష్టమైన హామీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కాలుష్యానికి కేరాఫ్ (మెదక్)
1995లో ప్రత్యేక పంచాయతీగా అవతరించిన ఐడీఏ బొల్లారంలో అప్పటికే వందల పరిశ్రమలు
ఏర్పాటు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలిక సంఘాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం సైతం 22 వార్డులతో మున్సిపల్ హోదా దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు చకచకా ఏర్పాటు సాగుతున్నాయి. నాయకులు ‘తొలి’ కీర్తి దక్కించుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇదే సమయంలో ప్రచారానికి వచ్చే నాయకులకు తమ సమస్యలు ఏకరవు పెట్టాలని ప్రజలు భావిస్తున్నారు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు, కొన్ని కాలనీల ప్రజలు జల కాలుష్యంతో సహజీవనం చేయాల్సి వస్తోంది. వర్షం నీటిలో కాలుష్య జలాలను గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేస్తూ పరిశ్రమల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక అన్ని కాలాల్లో వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రసాయన, ఇనుము తయారీ, ప్లాస్టిక్, రెడీమిక్స్, కాగితం పరిశ్రమలు వదిలే కాలుష్యం అంతా ఇంతా కాదు. ఇక భారీ వాహనాల రాకపోకల కారణంగానూ సమస్య ఉత్పన్నమౌతోంది. పారిశ్రామిక వాడలో వ్యర్థాల దహనంతో ఆయా ప్రాంతాల్లో ఊపిరితీసుకోలేని పరిస్థితి.స్థానికంగా 80 వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఆసానికుంట పూర్తిగా విషపూరితమైంది. మరో 6 కుంటలు కాలుష్య కాసారాలుగా మారాయి. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలలో టీడీఎస్ కనిష్టంగా 3వేల పీపీఎం ఉంటోంది.కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అస్తమా, శ్వాసకోశ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటివి నిత్యం బాధిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడున్న పరిశ్రమల్లో పనిచేసేవారు, వారి కుటుంబీకులు అనారోగ్యం పాలైతే పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటున్న పరిశ్రమలు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ చూపడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి స్థానికంగా కాలుష్య నిర్ధరణ సూచిని ఏర్పాటు చేసినా దాని ఆధారం తీసుకున్న చర్యలు లేవు. కాలుష్య నియంత్రణలో చెట్ల పాత్ర కీలకం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం నిర్వహిస్తున్నా ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కాలనీలు, పరిశ్రమల ఆవరణలో వేల మొక్కలు నాటే అవకాశం ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.