బీజేపీతో పాచికలు పారవనే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీతో పాచికలు పారవనే

ముంబై, జనవరి 9 (way2newstv.com)
శరద్ పవార్ సీనియర్ నేత. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీని పెట్టి కీలక నేతగా ఎదిగారు. జాతీయ రాజకీయాల్లో సయితం ఆయన మొన్నటి వరకూ చక్రం తిప్పారు. శరద్ పవార్ ముందు చూపున్న వ్యక్తి. జరగబోయే రాజకీయ పరిణామాలను ఆయన ముందుగానే ఊహించి ఏ నిర్ణయమైనా తీసుకుంటారంటారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అవ్వడంతో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతారని అందరూ భావించారు.శరద్ పవార్ కు రాష్ట్రపతి పదవి హామీ లభించిందన్న వదంతులు కూడా వ్యాపించాయి. కానీ మోదీ, షాల సంగతి శరద్ పవార్ కు తెలియంది కాదు. బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా తన మాట ఆ ప్రభుత్వంలో నెగ్గదని తెలుసు. బీజేపీతో పొత్తుతో తన కుమార్తె సుప్రియా సూలెకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయి. అలాగే మహారాష్ట్రలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎన్సీపీకి దక్కుతాయి.
బీజేపీతో పాచికలు పారవనే

కానీ బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యాచించడమే తప్ప శాసించడం ఉండదని శరద్ పవార్ కు తెలియంది కాదు. బీజేపీ ఇచ్చిన శాఖలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. పైగా శివసేన కు సానుభూతి పెరిగి అది రాష్ట్రంలో మరింత పట్టుబిగించే అవకాశం ఉంటుంది. అదే బీజేపీని, శివసేనను విడదీస్తే ఓటు బ్యాంకుకు గండిపడటమే కాకుండా శివసేనకు కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందన్న శరద్ పవార్ అంచనా నిజమవుతున్నట్లే కన్పిస్తుంది. పవార్ అనుకున్నట్లుగానే మహారాష్ట్ర మంత్రివర్గంలో కీలక పదవులను దక్కించుకున్నారు. తన సోదరుడు కుమారుడు అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖలను దక్కించుకున్నారు. అలాగే మరో కీలకమైన ఎన్సీపీ నేత అలిన్ దేశ్ ముఖ్ కు హోంశాఖను కేటాయింప చేసుకున్నారు. తన మిత్ర పక్షమైన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి మరీ శరద్ పవార్ కీలక శాఖలన్నీ దక్కించుకున్నారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ప్రభుత్వ నిర్ణయం శరద్ పవార్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. మొత్తం మీద శరద్ పవార్ అంచనా నిజమైందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.