న్యూఢిల్లీ, జనవరి 29, (way2newstv.com)
మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్ 2020ను ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (శనివారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ బడ్జెట్‌ను ఆవిష్కరించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్ద కాలంలోనే ఎంతో క్లిష్టమైన బడ్జెట్ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకో చూద్దాం.ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ 1 శాతానికి పడిపోనుంది. 17 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయిగా నిలువనుంది. జీడీపీ వృద్ధి 5 శాతంగా ఉండొచ్చని అంచనా. ఇది 11 ఏళ్ల కనిష్ట స్థాయి. ప్రైవేట్ వినియోగం కూడా ఏడేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8 శాతంగా నమోదు కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగ వృద్ధి కూడా 15 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించనుందని లెక్కేశారు. వ్యవసార రంగ వృద్ధి కూడా నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి క్షీణించనుంది.
బడ్జెట్ పై భారీ ఆశలు
ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఇలాంటి కీలకమైన రంగాలన్నీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటం ఆలోచించాల్సిన విషయం.ద్రవ్యోల్బణం కూడా పైకి కదులుతోంది. వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలోనే 7.35 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ అంచనాలు దాటేసింది. రిజర్వు బ్యాంక్ కీలక రెపో రేటును గతేడాది ఆరు సార్లు తగ్గించినా కూడా ఫలితం లేకపోవడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే మరో కీలక సూచీగా పరిగణించే ద్రవ్య లోటు కూడా కట్టుతప్పింది. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.3 శాతంగా నిర్ణయించుకుంది. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మోదీ సర్కార్ నిర్దేశించుకున్న ద్రవ్య లోటును దాటిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ద్రవ్య లోటు ఏకంగా 3.8 శాతానికి ఎగబాకినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు.అంతేకాకుండా పన్ను వసూళ్లు కూడా తగ్గాయి. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి నెలకొంది. మరోవైపు బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ కూడా నెమ్మదించింది. వ్యవస్థలో డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు దేశంలో నిరుద్యోగం ఏకంగా 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం గడ్డు పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.