చీకట్లలో పాఠశాలలు
రంగారెడ్డి, సెప్టెంబర్ 11, (way2newstv.com)
రాష్ర్టంలో సర్కారు బడుల్లో కరెంట్ వస్తలేదు. ఒక్కో స్కూలు బకాయిలు వేలల్లో ఉండటంతో విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేస్తున్నారు. బిల్లు చెల్లిస్తేనే కరెంటు సప్లై చేస్తామని స్పష్టం చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బడుల్లో రూ.14.51 కోట్ల బకాయిలుంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని కాలేజీల్లో రూ.17.72 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన విద్యాశాఖ పరిధిలో సుమారు 32.23 కోట్ల బకాయిలున్నట్టు తెలుస్తోంది.స్టేట్‌లో మొత్తం 25 వేల సర్కారీ బడులున్నాయి. వీటిలో స్టూడెంట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులిస్తోంది. వందలోపు పిల్లలున్న స్కూళ్లకు రూ.15 వేలు, 250లోపు ఉంటే రూ.30 వేలు, వెయ్యిలోపు ఉంటే 40 వేలు, వెయ్యి మందికిపైగా స్టూడెంట్స్ ఉంటే 60 వేల గ్రాంట్స్‌ను ఇస్తోంది. ఈ నిధులతోనే పండుగలు, ఆఫీస్ నిర్వహణ, ఇతర పనులు చేయాల్సి ఉంది.
స్కూళ్లకు రాని గ్రాంట్లు...
వీటిలోంచే మైనర్ రిపేర్స్‌తో పాటు కరెంట్ బిల్లులు కూడా కట్టాలి. గతంలో జిల్లా పరిషత్, మండల్ పరిషత్ స్కూళ్లకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద వాటర్, కరెంట్‌చార్జీల కోసం అడిషనల్‌గా కొన్ని నిధులు ఇచ్చేవారు. కానీ కొన్నేండ్లుగా ఆ నిధులు విడుదల కావడం లేదు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. పదేండ్ల క్రితం నిర్ణయించిన బిల్లులను ప్రభుత్వం ఇస్తోంది. నెలకు రూ.250 నుంచి 300 వరకూ పంపుతోంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఒక్కో విద్యాసంస్థలో నెలకు రూ.2 వేల నుంచి రూ.15 వేల వరకూ కరెంట్ బిల్లు వస్తోంది. దీంతో భారీగా కరెంట్ బకాయిలు పెరిగిపోయాయి. వందలాది ప్రైమరీ స్కూళ్లు, పదుల సంఖ్యలో కాలేజీల్లో కరెంట్ కట్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, సర్కారు నిధులివ్వకపోవడంతో పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మరోపక్క స్కూళ్లకు, కాలేజీలకు విద్యుత్ శాఖ నోటీసులు ఇస్తూనే ఉంది.హైస్కూళ్లలో కంప్యూటర్లు ఉండటం, డిజిటల్ క్లాసులు కొనసాగుతుండటంతో ఈ మధ్యకాలంలో కరెంట్ వాడకం ఎక్కువైంది. అన్ని తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండటంతో బిల్లులు భారీగానే వస్తున్నాయి. బిల్లుల భారంతో హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్ పొదుపు పాటిస్తున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను పెద్దగా వాడటం లేదు. ఆఫీస్ రూమ్‌లో మాత్రం కరెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే క్లాస్ రూముల్లో ఫ్యాన్లు లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. దీంతో డెంగీ వస్తుందేమోనని పిల్లలు, టీచర్లు భయపడుతున్నారు. మరోవైపు స్కూళ్లలో, కాలేజీల్లో కరెంట్ బకాయిల వివరాలు మరోసారి సేకరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు వచ్చే బిల్లులు కమర్షియల్ కేటగిరీలోవని, వీటికి డొమోస్టిక్ కు మారిస్తే బిల్లులు కొంత తక్కువగా వచ్చే అవకాశముందని టీచర్ యూనియన్ నేతలు చెప్తున్నారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.మేడ్చల్ జిల్లాలోని కుమ్మరిబస్తీ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో 100 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ బడికి రూ.39 వేల కరెంట్ బిల్లు బకాయి ఉందని ఏడాది క్రితమే కరెంట్ కట్ చేశారు. బకాయిల కోసం ఆ స్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మణ్‌రావు విజ్ఞప్తి చేయడంతో.. వారం రోజుల కిందట ఎంపీ రేవంత్‌రెడ్డి రూ.30 వేలు విరాళం ఇచ్చారు. మిగిలిన మొత్తం కట్టి బకాయి క్లియర్ చేశారు. దీంతో స్కూల్‌కు కరెంట్ వచ్చింది.ఇక్కడ మాత్రమే కాదు.. రాష్ర్టంలోని వేలాది సర్కారీ స్కూళ్లు , కాలేజీల్లో ఇదే దుస్థితి. కరెంట్ చార్జీల కోసం ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకుండా, నామమాత్రంగా మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇస్తుండటంతో కరెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి.
Tags:
telangananews