ఏపీలో ఎన్పీఆర్ అడుగులు

విజయవాడ, జనవరి 24, (way2newstv.com)
ఎన్‌పిఆర్‌ రూపకల్పన దిశలో రాష్ట్రంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్‌ఆర్‌సి అమలు చేయమని చెప్పినప్పటికీ ఆచరణలో దానికి దారితీసే ఎన్‌పిఆర్‌ను సజావుగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం జోరుగా చేస్తోంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తిచేసింది. తాజాగా ఎన్‌పిఆర్‌పైన కొన్ని వివరణలు అంటూ  124వ నెంబరు జిఓను జారీ చేసింది. దీనిలో ఎన్యూమరేటర్లు వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని సూచనలు చేసింది. ఎన్‌పిఆర్‌పై అనేక భయాలు, సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి వివరణలు ఇస్తున్నట్లు దీనిలో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా ప్రయోగాత్మకంగా ఎన్‌పిఆర్‌ను నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని 8 గ్రామాలు, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో పూర్తిగా, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలోని ఆరు వార్డుల్లో ఈ ప్రక్రియ సాగింది. 
ఏపీలో ఎన్పీఆర్ అడుగులు

ఈ ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నలకు ప్రజలు సహకరించారని, ఎటువంటి అభ్యంతరాలు రాలేదని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీంతో ఎన్‌ఆర్‌సిని రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం లేదన్నది స్పష్టమౌతోంది.వివిధ పత్రాలతో పాటు ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చి తీరాలని ప్రజలను ఒత్తిడి చేయవద్దని ఈ జిఓలో ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు సూచించింది. 'ఎన్‌పిఆర్‌ ప్రక్రియకు సంబంధించినంత వరకు ప్రజలు చెప్పిన విషయాలను నమోదు చేసుకుంటే సరిపోతుంది. వారు ఎటువంటి పత్రాలను చూపించనవసరం లేదు. అదేవిధంగా వారికి ఇష్టంలేని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరమూ లేదు. వాటికోసం ఒత్తిడి చేయవద్దు.' అని పేర్కొంది. ఇదే విషయాన్ని సిబ్బందికి, అధికారులకు ఇచ్చిన సూచనల్లో స్పష్టంగా చెప్పినట్టు, మరోసారి జిల్లా కలెక్టర్లు దిగువ వరకు దీనిని తీసుకువెళ్లాలని జిఓలో ప్రభుత్వం సూచించింది. ఈ తరహా సూచనలు ఎన్ని చేసినప్పటికీ ఎన్యూమరేటర్లు ఎవరినైనా ఎన్‌పిఆర్‌లో అనుమానితులుగా నమోదు చేసే అవకాశం ఉంది. దీనికి ఎన్యూమరేటర్‌ ఏ కారణమైనా చూపవచ్చు. ఒక్కసారి అనుమానితులుగా నమోదైతే, వారి పేరు ఎన్‌ఆర్‌సిలో చేర్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టే! ఎన్‌ఆర్‌సిలో పేర్లు చేరితే పౌరసత్వాన్ని రుజువుచేసుకునే బాధ్యత వ్యక్తులపైనే ఉంటుంది. ఎన్‌పిఆర్‌ దశలో అవసరం లేదని చెబుతున్న పత్రాల కోసం అప్పుడు పరుగులు తీయాల్సిఉంటుంది. తల్లితండ్రులు, తాతల జన్మస్థలాల నిరూపణ కోసం పత్రాలు చూపించాల్సివస్తుంది. ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ంగానే విస్మరిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్‌ఆర్‌సిని అమలు చేసేది లేదంటూ చేసిన ప్రకటనపై చిత్తశుద్ది ఉంటే, ఇప్పుడైనా ఎన్‌పిఆర్‌ నిర్వహణ నుండి తప్పుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
Previous Post Next Post