ప్రకటనలకే పరిమితం (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకటనలకే పరిమితం (కరీంనగర్)

కరీంనగర, ఫిబ్రవరి 6 (way2newstv.com): సింగరేణి కార్మికుల సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని యాజమాన్యం చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితం అవుతున్నాయి. దీంతో చిన్న చిన్న సమస్యలతో కార్మికులు నలిగిపోతున్నారు. ఇటు యాజమాన్యం సమస్యను పరిష్కరించడం లేదు.. అటు గుర్తింపు సంఘం సరైన బాధ్యత పోషించలేకపోతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్మికులు అంతర్గతంగా ఇబ్బందులు పడుతున్నారు. గనులపై నెలకొనే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించే స్థాయిలో గుర్తింపు సంఘం నాయకులు లేరని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.


ప్రకటనలకే పరిమితం (కరీంనగర్)

కార్మికుల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా సీపీఆర్‌ఎంఎస్‌ పథకం కింద రూ.2 వేలు వసూలు చేసే వరకు గుర్తింపు సంఘానికి కనీసం సమాచారం లేకపోవడం యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిదర్శనం. తమకు సమాచారం లేకుండా కార్మికుల నుంచి వసూలు చేస్తుందని గుర్తింపు సంఘం నాయకులు ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి గుర్తింపు సంఘంగా నాయకత్వం సరైన పాత్ర పోషించలేకపోతోంది. గనులపై చిన్న చిన్న కారణాలకే ఛార్జిషీట్లు జారీ చేస్తున్న వాటికి సమాధానాలు చెప్పుకోవడానికి కూడా గుర్తింపు సంఘం నాయకులు వారికి సహకరించని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకు గుర్తింపు సంఘాన్ని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం మొక్కుబడిగా మాత్రమే యాజమాన్యం గుర్తింపు సంఘం నాయకులతో సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో కూడా ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడం లేదు. సీఎండీ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తున్న యాజమాన్యం కొత్తగా గుర్తింపు సంఘంతో చర్చించి అమలు చేసిన సందర్భాలు చాలా తక్కువే.

సింగరేణి గుర్తింపు సంఘంలో పని చేస్తున్న నాయకులు నామమాత్రంగానే పదవుల్లో కొనసాగుతున్నారు. గని స్థాయి నుంచి కేంద్ర కమిటీ నాయకత్వం వరకు ఎవరికీ అంతగా పవర్‌ లేకుండా పోయింది. దీంతో యాజమాన్యం కూడా వీరితో సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికలు జరిగి ఏడాది గడిచిపోయినా కార్మికులకు లాభం చేకూరే విధంగా తీసుకున్న నిర్ణయాలు లేవు. కేవలం పదవుల్లో మాత్రమే నాయకులు కనిపిస్తున్నారన్నది కార్మికుల ఆరోపణ. లాభాల వాటాతో పాటు ఏసీలు, రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, కారుణ్య నియామకాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినవే. కాని గుర్తింపు సంఘం ముద్ర ఎక్కడ కనిపించడం లేదు.

ఇటీవల మణుగూరులో జరిగిన తెబొగకాసం కేంద్ర కమిటీ సమావేశంలో కింది స్థాయి నాయకత్వం ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. కార్మికులకు నాయకత్వంగా సాధించిన విషయాలు ఏమి లేవన్నది కార్మికుల్లో చర్చ జరుగుతుందని సమావేశంలో చర్చించారు. గెలిచిన తర్వాత కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నామని, దీంతో కార్మికుల్లో తమ పట్ల అపనమ్మకం ఏర్పడుతుందని కొంత మంది నాయకులు అగ్ర నాయకత్వాన్ని నిలదీసినట్లు సమాచారం. కార్మికులకు ఏమి చేయలేకపోతున్నామన్న విషయాన్ని ద్వితీయశ్రేణి నాయకత్వం సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. దీనిపై అగ్ర నాయకత్వం కూడా సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది.