గట్టుదాటని పరిస్థితులు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గట్టుదాటని పరిస్థితులు (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఫిబ్రవరి 6  (way2newstv.com):  జిల్లాలో కాలువలు, మురుగు కాలువలకు సంబంధించిన ఆధునికీకరణ పనులు గడప దాటే పరిస్థితి కనిపించడం లేదు. వీటిలో కొన్నింటికి రెండుసార్లు, మరికొన్నింటికి మూడుసార్లు టెండర్లు    పిలిచినా పెద్దగా స్పందన రాలేదు. అన్నదాతకు   అవసరమైన కీలక పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో జరుగుతాయా లేవా అనే అనుమానాలు రైతాంగంలో కలుగుతుండగా సంబంధిత అధికార యంత్రాంగంలోనూ ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.
జల వనరుల శాఖ ఎస్‌ఈ స్థాయిలో ఇప్పటివరకు పిలిచిన టెండర్లకు సంబంధించి మొత్తంగా రూ. 42.74 కోట్ల విలువ గల 37 పనులకుగాను కేవలం రూ. 7.90 కోట్ల విలువైన ఏడింటికి మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. ఇందులోనూ పంట కాలువ పనులకు కొంత స్పందన కనిపించినా మురుగు కాలువల పనులకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.



 గట్టుదాటని పరిస్థితులు (పశ్చిమగోదావరి)

ఈ స్థాయిలో పంట కాలువలకు సంబంధించి రూ. 10 కోట్ల విలువ గల 60 పనులకుగాను రూ. 5 కోట్ల విలువైన 37 మాత్రమే టెండరుకు నోచుకున్నాయి. మురుగు కాలువలకు సంబంధించి ఏ ఒక్క పనికీ ముందుకురాలేదు. మొత్తంగా పరిశీలిస్తే దాదాపు రూ. 50 కోట్ల పనులు ఇంకా టెండర్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోసారి పిలిచిన కొన్ని పనుల టెండర్లను వారం రోజుల్లో తెరవనున్నారు. ఇంకొన్ని పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వీటికి కాంట్రాక్టర్లు ముందుకొస్తే సరేసరి లేకుంటే ఖరారైన కొద్దివాటితోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరోపక్క   వేసవిలో కాలువలను కట్టివేసే గడువు తరుముకొస్తోంది. ఈ నేపథ్యంలో పనులు మొక్కుబడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.

వేసవిలో కాలువలు కట్టివేసే సమయంలోనే జలవనరులశాఖ, మురుగునీటి పారుదలశాఖలు కాలువలు, మురుగు కాలువలపై రైతాంగానికి అవసరమైన పనులను చేపడుతుంటాయి. ప్రస్తుతం కాలువలు కట్టివేసే గడువు దగ్గరపడడంతో ఇంకా టెండర్లకు నోచుకోని పనులపై సంబంధిత అధికార యంత్రాంగంతో పాటు సాగునీటి సంఘాల ప్రతినిధుల్లో అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి నూరుశాతం పనులను చేపట్టాలని పాతవాటికే ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన పనులతో పాటు అప్పట్లో టెండర్‌కు నోచుకోని పనులన్నిటిని కలిపి ఈ వేసవిలో చేపట్టేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ దిశగానే వీటికి టెండర్లను పిలిచారు. వీటిలో చిన్నపాటి పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాగా పెద్ద పనుల జోలికి మాత్రం వెళ్లడంలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. రాబోయేది ఎన్నికల సమయం. సరిగ్గా వేసవిలో సాధారణ, పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కోడ్‌ అమలులోనే ఉంటుంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రజల తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇటువంటి తరుణంలో రూ. కోట్ల విలువైన పనులను చేసుకెళ్లితే బిల్లులు మంజూరు ఏ విధంగా ఉంటుందోనని అనుమానం గుత్తేదారుల్లో కనిపిస్తోంది. గతంలో చేసిన పనులకు రావల్సిన సొమ్ములో తీవ్రజాప్యం చోటు చేసుకోవడంతో పనులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తమ్మీద అన్ని రకాలుగా కలిపి రూ. 40 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటికే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిన గుత్తేదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీనికితోడు ప్రస్తుత మార్కెట్లో ధరలు అంచనాల్లో ప్రతిపాదించిన ధరలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

ఈసారి కీలకమైన పనులు కదిలేలాలేవు. అన్ని ప్రధాన కాలువలతో పాటు ఉపకాలువలపై ఈసారి రైతులకు అవసరమైన ప్రాధాన్యత పనులనే ప్రతిపాదించారు. ప్రధానంగా కాలువల వెంబడి బలహీనంగా ఉన్న గట్టు పటిష్టతకై కాంక్రీట్‌ గోడ నిర్మాణాలు, అవసరమైన చోట్ల స్లూయిస్‌ నిర్మాణాలు, మరమ్మతుల పనులు, లాకు తలుపులు, షట్టర్స్‌, వంతెనలు, తూరలు ఇలా అనేక పనులు చేపట్టదల్చారు. మురుగుకాలువలపైనే ఇంతే. వీటిలో అధిక పనులకు టెండర్‌ ఖరారు కాకపోవడంతో ఈ ఏడాది ఉండవేమోనని రైతాంగం భావిస్తుంది. నరసాపురం ప్రధానకాలువపై మార్టేరు వద్ద సుమారు ఆరేళ్ల కితం మొదలెట్టిన వీయ్యర్‌ నిర్మాణం నేటికి పూర్తికాలేదు. జిన్నూరు వద్ద కొత్తగా నిర్మించిన వంతెనకు అప్రోచ్‌ పనులకు టెండర్‌ ఖరారై ఏడాది కావొస్తున్న ముందుకెళ్లడంలేదు. ఇలా అన్ని కాలువలపైనే కీలక పనులు ఎదురుచూస్తున్నాయి. ఈసారైన వీటిని పూర్తిచేయాలని రైతాంగం కోరుతోంది.