విశాఖ జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్ధులు రెడీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖ జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్ధులు రెడీ

విశాఖపట్టణం, ఫిబ్రవరి 18, (way2newstv.com)
విశాఖ జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్ధులు రెడీ అయిపోయారు. జిల్లాలో ఉన్న మూడు లోక్ సభ సీట్లకు గాను ఆ పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేసిందని అంటున్నారు. దాంతో కీలకమైన పార్లమెంట్ ఎన్నికలకు పసుపు పార్టీ సర్వ శక్తులు సమకూర్చుకుని సిధ్ధంగా ఉందని చెబుతున్నారు. విశాఖ ఎంపీ సీటును దివంగత నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనమడు, గీతం విద్యా సంస్థల ఆధినేత శ్రీ భరత్ కి ఇవ్వాలని దాదాపుగా డిసైడ్ అయిపోయారు. శ్రీ భరత్ కి ఉన్న రాజకీయ నేపధ్యం, కుటుంబ బాంధవ్యం కూడా ఆయన ఎంపికను సులువు చేశాయని అంటున్నారు. శ్రీ భరత్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు కూతురు కొడుకు, అంతే కాదు, సినీ నటుడు బాలక్రిష్ణకు రెండవ అల్లుడు, టీడీపీ భావి నాయకుడు లోకేష్ కి స్వయాన తోడల్లుడు. దాంతో ఆయన్నే ఎంపీ క్యాండిడేట్ గా పెట్టి విశాఖ సీటుని గెలుచుకోవాలనుకుంటున్నారు. 


 విశాఖ జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్ధులు రెడీ

దీని మీద శ్రీ భరత్ తన మనసులోని మాటను కూడా మీడియాతో పంచుకున్నారు. తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని, అధినాయకత్వం టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని కూడా చెప్పుకున్నారు. విశాఖ ఏజెన్సీలోకి కీలకమైన అరకు ఎంపీ సీటు పార్టీలోకి వస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కి ఇస్తున్నారు. ఆయన ఆరు పర్యాయాలు ఇక్కడ నుంచి గెలవడం, బలమైన కురుపాం రాజ వంశీకుడు కావడం, గిరిజనుల్లో పేరున్న కుటుంబం కావడం వల్ల టీడీపీ ఆయనకే ఓటు వేస్తోంది. దానికి తగినట్లుగా రాజు గారు కూడా ఏపీలో వేరే రాజకీయ ప్రత్యామ్నాయం లేదని, టీడీపీయే దిక్కు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గిరిజనుల్లో పట్టు తనకు ఉపకరిస్తుందని, టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కలసివస్తుందని ఆయన నమ్ముతున్నారు. దాంతో అరకు సీటు కోసం ఇతర నాయకులు ఉత్సాహపడినా టీడీపీ ఏరి కోరి మరీ రాజు గారికే టికెట్ అంటోంది. అనకాపల్లి ఎంపీ సీటుని బ్రాండిక్స్ దొరకు ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోందని అంటున్నారు. విశాఖ రూరల్ జిల్లా అచ్యుతాపురం లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాండిక్స్ ని ఏర్పాటు చేసిన దొరై స్వామి స్థానికంగా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక్కడ వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. దాంతో ఆయా కుటుంబాల ఓట్లు తీసుకున్నా దోరై స్వామికి పెద్ద ఓటు బ్యాంక్ అవుతుందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ఆయన టీడీపీ పెద్దలతో మంచి రాజకీయ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఉండడం, ఏకంగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబుతో పరిచయాలు కూడా కలిగి ఉండడం, ఆయన అభర్ధిత్వాన్ని బలపరుస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ముగ్గురూ టీడీపీకి విశాఖ జిల్లాలో ఎంపీ అభ్యర్ధులుగా ఉంటారని అంటున్నారు..