మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు?

కడప, ఫిబ్రవరి 15, (way2newstv.com)
సీనియర్ రాజకీయ నేత.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు? టీడీపీలోకి వెళ్లాలా? వెళితే మైదుకూరు టిక్కెట్ వస్తుందా? వైసీపీలోకి వెళ్లాలని అనుచరుల నుంచి వత్తిడి మరోవైపు. వైసీపీలోకి వెళ్లినా టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో ఆయనను కాదని వైసీపీ అధినేత జగన్ ఇస్తారా? అన్నది అనుమానమే. ఇప్పుడు డీఎల్ రవీంద్రారెడ్డి ఏ పార్టీలో చేరాలన్నా టిక్కెట్ హామీ వస్తేనే. మరి రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ నుంచి మాత్రం ఆ హామీ డీఎల్ కు దొరకడం లేదు.రెండు పార్టీలూ తమ పార్టీలో చేరి తమ అభ్యర్థికి మద్దతిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు గ్యారంటీ అని మాత్రం చెబుతుండటంతో డీఎల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 


మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు?

మైదుకూరు నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ డీఎల్ ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే విజయం. డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ఏపార్టీలో చేరకుండా ఉండిపోయారు.మొదట ఆయన వైసీపీలో చేరతారన్న టాక్ నడిచింది. డీఎల్ కు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తుంది. ఆయన ఎప్పుడూ ఆ బలంతోనే విజయాలు సాధించారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయనను కాదని జగన్ డీఎల్ కు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. డీఎల్ అనుచరులు ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలసి డీఎల్ టిక్కెట్ విషయమై సంప్రదించినా ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలిసింది. టీడీపీలో చేరాలని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన వత్తిడి వస్తోంది. కానీ ఇక్కడ కూడా సీటు ఖాళీ లేదు. ఇప్టటికే టీటీడీ ఛైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ తానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని అని పదే పదే చెబుతున్నారు. ఇటీవల మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా పుట్టాయే అభ్యర్థి అని ప్రకటించారు. గత ఐదేళ్లుగా పుట్టాసుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉంటూ నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు. పైగా యనమల సిఫార్సు కూడా ఉంది. దీంతో డీఎల్ టీడీపీలోకి వెళ్లినా టిక్కెట్ గ్యారంటీ లేదు. దీంతో డీఎల్ ఏ పార్టీలో చేరతారన్నది త్వరలో జరిగే అనుచరుల సమావేశంలో తేలిపోనుంది. డీఎల్ మద్దతు ఎవరికి ఉంటే వారిదే గెలుపు అన్నది మాత్రం వాస్తవం. మారి డీఎల్ మొగ్గు ఎటువైపు అన్నది వేచి చూడాల్సిందే.