ఆర్ధిక మంత్రి లేకుండానే బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్ధిక మంత్రి లేకుండానే బడ్జెట్

హైద్రాబాద్, ఫిబ్రవరి 15, (way2newstv.com)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్త షాక్ ఇవ్వ‌నున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఆర్థిక మంత్రి లేకుండా తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌కుమునుపే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు గానీ ప‌రిస్థితులు మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. త‌న అహం సంతృప్తి ప‌ర‌చుకోవ‌డానికి విల‌క్ష‌ణ రాజ‌కీయాలు చేసే కేసీఆర్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 22 నుంచి – 25వ తేదీ వరకు బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


ఆర్ధిక మంత్రి లేకుండానే బడ్జెట్

22వ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 23న బడ్జెట్ పై చర్చ, 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అంటే మ‌రో ఏడు రోజుల్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయాలి. లేదంటే… ముఖ్య‌మంత్రే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు. ఇది జ‌రిగితే ఎప్ప‌టికీ ఇది ఒక సంచ‌ల‌నంగా నిలిచిపోతుంది. వాస్త‌వానికి ఒక నెల ముందు నుంచే ఆర్థిక మంత్రులు బ‌డ్జెట్‌పై స‌న్నాహాలు చేసుకుంటారు. కానీ మ‌రో ఏడు రోజులే మిగిలి ఉంది… కానీ ఆర్థిక మంత్రే లేడు. అంటే దీన్ని బ‌ట్టి బ‌డ్జెట్ కేసీఆర్ ముఖ్య‌మంత్రి హోదాలో ప్ర‌వేశ‌పెడ‌తార‌నే అంటున్నారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌కు *అంతా తానే* అనే ఒక ఇంప్రెష‌న్ వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఇంత‌వ‌ర‌కు మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ చేయ‌క‌పోవ‌డ‌మే ఒక వింత అయితే ఇక మొద‌టి స‌మావేశాల్లో అది కూడా బ‌డ్జెట్ స‌మావేశాలు మంత్రులు లేకుండా నిర్వ‌హించ‌డం ఇంకా పెద్ద వింత అవ‌నుంది. 
తాజా స‌మాచారం ప్ర‌కారం… ఈసారి మంత్రి ప‌ద‌వులు తీసుకున్న వారికి అవేమీ ప్ర‌మోష‌న్లుగా ఉండ‌వ‌ని… రెండోసారి టీఆర్ఎస్ గెల‌వ‌డంతో కేసీఆర్‌-కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌తి రూపాయి ఖ‌ర్చు జ‌ర‌గాలి, ప్ర‌త్యేక టార్గెట్లు ఉండాలి… అందుకే ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ మంత్రి ప‌ద‌వి కూడా డిమాండ్ చేయ‌డం లేదు. కనీసం ఆశ కూడా వ్య‌క్తంచేయ‌లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా సెక్యూరిటీ పెర‌గ‌డం త‌ప్ప ఇత‌ర ప్ర‌యోజ‌నం ఏదీ ఉండ‌దు అనేది తెలంగాణ నేత‌ల అభిప్రాయంగా చెబుతున్నారు. అంద‌రూ ఆ విస్త‌ర‌ణ గురించి కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.