మత్స్య కారుల వివరాలు సేకరణలో సర్కార్

నల్గొండ, ఫిబ్రవరి 28, (way2newstv.com)
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం(ఎన్‌సీడీసీ)  పథకం అమలు కోసం ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాలని నిర్ణయించింది. సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి అందుకు అనుగుణంగా మత్య్సకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోనుంది. అందుకు అనుగుణంగా జిల్లాలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. ప్రతీ టీంలో ఇద్దరు ఫిషర్‌మెన్స్, మత్స్య అభివృద్ధి అధికారి ఉంటారు. జిల్లాలో 106 మత్స్యకార్మిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 8,509 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు మత్స్యకారులకు అందేవిధంగా ప్రతీ మత్స్యకారుడి పూర్తి వివరాలతో పాటు ఆధార్‌కార్డు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, గ్రామంలోని చెరువులు, కుంటలు, సమగ్ర వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. 


మత్స్య కారుల వివరాలు సేకరణలో సర్కార్

జిల్లాలోని ఆర్ధిక వనరులు, చెరువులు,కుంటలు మత్స్య సంపద వివరాలన్ని అందులో పొందుపరుస్తారు. వీటి ఆధారంగానే జిల్లాకు నిధులు మంజూరు కానున్నాయి. బోగస్ లబ్ధిదారులు ఉండకుండా నిజమైన మత్స్యకార్మిక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఆధార్‌కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు.జిల్లాలో ఉన్న మత్స్యసహకార సంఘాలు, సభ్యుల వివరాలు సేకరించేందుకు ఫిషర్‌మెన్ స్థాయి అధికారులను ఇద్దరి చొప్పున నాలుగు టీంలను ప్రభుత్వం నియమించింది. గ్రామానికి ఈ బృందం వచ్చే రెండు రోజుల ముందు సమాచారమిస్తారు. సహకార సంఘం అధ్యక్షుడితో పాటు సభ్యులందరికీ ముందస్తు సమాచారం ఇస్తారు. ప్రతీ సభ్యుడి సమగ్ర వివరాలు అధికారులు ఇచ్చే ఫార్మాట్‌లో నింపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు మత్స్యకారుల కుటుంబాల దరికి చేరనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకార్మికుల సంక్షేమానికి వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను చెరువులు, కుంటలకు సహకార సంఘాల వారీగా ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా మత్స్యకారుడికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.29.34 కోట్లు మంజూరు చేసింది. మత్స్యకారుల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి కాగానే మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా చేపలు పట్టుకునేందుకు వలలు, తెప్పలు అందివ్వనున్నారు. అంతేకాకుండా చేపలను మార్కెటింగ్ చేసేందుకు రవాణా సదుపాయం కోసం సబ్సిడీ ద్వారా ద్విచక్రవాహనాలు ఇవ్వనున్నారు. ఈ పథకంలో బోగస్ లబ్ధిదారులు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Previous Post Next Post