హైద్రాబాద్, మార్చి 26, (way2newstv.com)
లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు షాకిచ్చారు ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి. ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్ లభించకపోవడంతో ఆయన టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. ఈ నెల 29న ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2014లో మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన జితేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై కేంద్రాన్ని సమర్థంగా నిలదీశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అందరూ షాకయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఒకరిద్దరు తప్ప గెలవలేరని ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయి. ఈ కారణంతోనే ఆయనకు టిక్కెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.ఆయన స్థానంలో పారిశ్రామికవేత్త మన్నే శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. పార్టీ నిర్ణయంతో అలకబూనిన జితేందర్‌రెడ్డి కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.
29న బీజేపీలోకి జితేందర్ రెడ్డి
తనకు పరిచయమున్న కేంద్రమంత్రుల ద్వారా బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఆ పార్టీ ట్రబుల్ షూటర్ రాంమాధవ్.. జితేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్‌నగర్ రానున్నారు. ఈ సందర్భంగానే జితేందర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి, మరోసారి టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేకపోయిన జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన ఆయన, తాను బీజేపీలో చేరాలంటే కొన్ని కోరికలు తీర్చాలని అడిగినట్టు తెలుస్తోంది.బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వడం, 29న తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ కు వెళ్లే సమయంలో, హైదరాబాద్ నుంచి తనను కూడా మోదీ ప్రయాణించే చాపర్ లో మహబూబ్ నగర్ కు పంపడం, ఏదైనా ఓ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం... ఈ మూడు డిమాండ్లనూ జితేందర్ రెడ్డి బీజేపీ ముందుంచగా, తొలి రెండు డిమాండ్లకూ రామ్ మాధవ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. కాగా, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని జితేందర్ రెడ్డిపై ఆరోపణలు రాగా, మరోమారు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించిన సంగతి తెలిసిందే.