కొనేవారేరీ..? (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనేవారేరీ..? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 7 (way2newstv.com): 
డించిన పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తే అన్నదాత నష్టాల నుంచి లాభాల బాట పడతారు. ఒకవైపు ఆదిలాబాద్‌ జిల్లా రైతులు ఈ ఏడాది పండించిన మిర్చి, పసుపు లాంటి పంటలకు మార్కెట్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక శనగ రైతులు దళారుల మోసాలకు నష్టపోతున్నారు.
జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్‌లో పత్తి, సోయా, కంది పంటలను సాగు చేస్తుంటే, రబీలో శనగ సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, చీడపీడల బెడద అంతగా ఉండకపోవడంతో పాటు రాయితీపై ప్రభుత్వం విత్తనాలను అందించడం, నీటి తడులు తక్కువగా అవసరం ఉండడంతో శనగ పంట లాభాదాయకంగా ఉంది. ఈ ఏడాది  జిల్లావ్యాప్తంగా 28 వేలకు పైగా ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు. ఖరీఫ్‌లో సోయా పంటను సాగు చేసిన రైతులే కాకుండా పత్తి పంటకు గులాబీ రంగు వచ్చిన రైతుల్లో కొందరు పంటను తొలగించి శనగ పంట వేయడంతో గత ఏడాది కంటే 5 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. అత్యధికంగా జైనథ్‌, బేల, తాంసి, ఆదిలాబాద్‌ , తలమడుగు, భీంపూర్‌ మండలాల్లో రైతులు శనగ పంటను పండించారు.


కొనేవారేరీ..? (ఆదిలాబాద్)

సోయా పంట భూమిలో సాగు చేసిన శనగ పంట ఫిబ్రవరి మొదటి వారం నుంచే కోతకు వచ్చింది. కూలీల కొరతతో రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి ఎకరానికి రూ. 2 వేల చొప్పున పంటను తీయించారు. అలాగే క్రైషర్‌కు క్వింటాలుకు రూ. 250 నుంచి 300లు చెల్లించి చాలా మంది రైతులు పంటను ఇంటికి తీసుకురాగా మరో 40 శాతం మంది రైతుల పంట ధాన్యం  ఇప్పుడిప్పుడే ఇంటికి వస్తోంది. దీంతో మహారాష్ట్ర, ఆదిలాబాద్‌కు చెందిన దళారులు నేరుగా రైతుల ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పట్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయదు .. ఒకవేళ చేసినా డబ్బులు రావడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సిందేనంటూ రైతులను నమ్మించి మోసం చేయడం ప్రారంభించారు. మార్కెట్‌ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో గత్యంతరం లేక కొందరు చిన్న రైతులు దళారులకు అమ్ముతుంటే, మరికొందరు పెద్ద రైతులు మహారాష్ట్రలోని ఇందన్‌ఘాట్‌, అర్ణి మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. నాణ్యత, తేమ శాతం పేరిట క్వింటాలుకు 5 కిలోలు తరుగు తీయడంతో పాటు కమిషన్‌ పేరిట వందకు రూ.3ల చొప్పున అక్కడి వ్యాపారులు దండుకుంటున్నారు. రవాణాతో పాటు కూలీల ఛార్జీలు కలుపుకొంటే క్వింటాలుకు 300ల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి.
ఈ ఏడాది శనగ పంటకు మద్దతు ధర పెంచారు. గతేడాది క్వింటాలుకు రూ.4400లు ఉండగా, ఈ సారి అదనంగా రూ.220 కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనికితోడు ఈ ఏడాది శనగ పంటకు వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు సైతం ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు వస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పంట కోతకు వచ్చే సమయానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలని రైతులు కోరుతున్నారు.