ముంచుకొస్తున్న గండం (ప్రకాశం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముంచుకొస్తున్న గండం (ప్రకాశం)

ఒంగోలు, మార్చి 7 (way2newstv.com): 
వేసవి ఛాయలు ముంచుకొచ్చాయి.  అప్పుడే ఎండలు మండుతున్నాయి. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికే గ్రామాల్లో తాగునీటి బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎక్కువ శాతం గ్రామాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వేసవి ఆరంభానికి ముందే ఇలా ఉంటే... రానున్న నాలుగు నెలలు ఎలా గడపాలో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా- సమస్య తీవ్రత దృష్ట్యా గత నెలరోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిఫార్సు చేయాలంటూ క్షేత్రస్థాయి అధికారుల నుంచి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయానికి వినతులు వెల్లువెత్తుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలో మొత్తం 45 సీపీడబ్ల్యూ, 900 పీడబ్ల్యూ పథకాలు ఉండగా- నీటి లభ్యతతో పాటు పైప్‌లైన్‌ మరమ్మతుల దృష్ట్యా సీపీడబ్ల్యూ పథకాల పరిధిలోని గ్రామాలకు అరకొరగానే నీటి సరఫరా జరుగుతోంది. ఇప్పటి వరకూ 170 పీడబ్ల్యూ పథకాల బోర్లు ఎండిపోయాయి. నీటి వనరులు లేక పథకాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా పరిధిలోని గ్రామాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 


 ముంచుకొస్తున్న గండం (ప్రకాశం)

జిల్లా వ్యాప్తంగా మొత్తం 284 తాగునీటి చెరువులు ఉండగా- వాటిలో 220 నింపేందుకు ఇటీవల సాగర్‌ కాలువల ద్వారా అరకొరగానే నీటిని విడుదల చేశారు. దాంతో సగం చెరువుల్లో నాలుగో వంతు కూడా చేరలేదు. మరో నెల రోజులు దాటితే.. ఆయా గ్రామాల్లో నీటి సమస్య తెర పైకి రానుంది. వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే.. మే నాటి పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
2014లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లీటర్ల శుద్ధజలాన్ని రూ.రెండుకే సరఫరా చేసేందుకు గ్రామాల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎన్టీఆర్‌ సుజల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు ప్రధానంగా తాగునీటి పథకాల బావులు, బోర్ల నుంచి నీరు అందేలా ఏర్పాట్లు చేశారు. సుజల యంత్రానికి 40 లీటర్ల నీటిని అందిస్తేనే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు విడుదలవుతుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బోర్లు ఎండిపోవడం, తాగునీటి పథకాల నుంచి వచ్చే నీటిని ఇంటింటా కుళాయిలకే అరకొరగా ఇవ్వడం కారణంగా సుజల కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది.
గత కొన్నేళ్లుగా జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఏటికేడు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటి వనరుల లభ్యతా తగ్గుతోంది. దీంతో పశ్చిమ ప్రకాశంలోనే కాదు... గత ఏడాది కోస్తా తీర ప్రాంతంలోనూ విభిన్న పరిస్థితి నెలకొంది. సాధారణంగా కొత్తపట్నం మండలంలోని తీర గ్రామాలకు ఇప్పటి వరకూ తాగునీరే కాదు... సాగు నీటి సమస్యా తెలియదు. ఈ ప్రాంతంలో అధికశాతం వ్యవసాయ బోర్ల పైనే రైతులు ఏటా రెండు, మూడు పంటలు సాగు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 40 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు పుష్కలంగా ఉందుతుంది. దాంతో బిందు సేద్యం ద్వారా అన్ని రకాల పంటలకు సమృద్ధిగా నీరు ఉండేది. అలాంటి ఈ ప్రాంతంలో గత ఏడాది నుంచి వ్యవసాయ బోర్లతోపాటు తాగునీటి బోర్లలోనూ భూగర్భ జలాలు అడుగంటాయి. తాగునీటి బోర్లలో పూడికతీత కార్యక్రమం చేపడుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని తాగునీటి పథకాల బోర్లు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. దీంతో కొత్తబోర్లు వేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న గుత్తేదారులకు బిల్లులు నిలిచిపోయాయి. 2018 డిసెంబరు వరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న రూ. 35 కోట్ల నిధులు విడుదల చేసింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్లు వారి సమస్యల పరిష్కార నిమిత్తం పెన్‌డౌన్‌ చేయడంతో చెల్లింపులకు సంబంధించిన దస్త్రం ముందుకు కదలలేదు. మరోవైపు ఖజానా శాఖ ఆంక్షల కారణంగా బిల్లులు పాస్‌ కాని పరిస్థితి. ఎన్నికల సీజన్‌ కావడంతో బిల్లుల చెల్లింపుల కోసం కొందరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 620 ఆవాస ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రణాళిక వేశారు. అందుకు రూ. 59.01 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలోని 412 గ్రామాల్లో రోజుకు 5,300 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. గణాంకాలను బట్టి గత ఏడాది ఇదే సమయానికి 168 ఆవాస ప్రాంతాల్లో రోజుకు 1651 ట్రిప్పులు రవాణా చేస్తుండగా- ప్రస్తుతం ఆ ట్రిప్పుల తోలకం రెట్టింపైంది. గడిచిన వర్షాకాలంలో వరుణుడు ముఖం చాటేయడంతో ఎక్కువ గ్రామాల్లో వేసవి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతూనే ఉంది. ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. గత రెండు వారాలుగా మూడు గ్రామాల చొప్పున ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. పల్లెల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే రానున్న నాలుగు నెలల సమయం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు కత్తిమీద సాముగా కనిపిస్తోంది. 2017లో 450 ఆవాస ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరగ్గా.. గత ఏడాది 513 ఆవాస ప్రాంతాలకు సరఫరా చేశారు. అందుకు రూ. 35.22 కోట్లతో ప్రతిపాదించారు. ఈ ఏడాది సమస్య తీవ్రత దృష్ట్యా నీటి సరఫరా డిమాండ్‌ ఉన్న గ్రామాల సంఖ్య పెరగనుంది.