అంతా తప్పుల తడక (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతా తప్పుల తడక (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 7 (way2newstv.com): 
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో కనీసం పేరు కూడా అర్థమవని స్థితిలో జాబితా తయారైంది. తుది ఓటరు జాబితాతో పాటు అంతర్జాలంలో పొందుపర్చిన జాబితాలోనూ ఇలాగే చాలా పేర్లు ఉండటంతో ఓటర్లు కంగుతినాల్సి వస్తోంది. కనీసం జాబితాలో ఉన్న పేరు తమదేననేది రూఢీ చేసుకోవడం కష్టమైన ప్రక్రియగానే మారింది. ఈ ఇబ్బందిని తీర్చాలని ఓటర్లు కోరుతున్నారు.
మళ్లీ అదే తకరారు.. ఓటరు జాబితా రూపంలో ఎదురవుతోంది. ముందు చూపులేని తీరు.. మొక్కుబడి పర్యవేక్షణ వెరసి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రూపొందిన ఓటరు జాబితాలో ఇక్కట్లే దర్శనమిస్తున్నాయి. తప్పుల తడకగా పేర్లు.. నివాసానికి దూరంగా పోలింగ్‌ కేంద్రాల కేటాయింపు.. ఇతర జిల్లాల్లోని జాబితాలో కనిపిస్తున్న స్థానికేతరుల పేర్లతో అటు నాయకులు, అధికారులు, ఓటర్లు కంగుతింటున్నారు. జాబితాలో ఉన్న సమస్యను తీర్చాలని పలువురు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు జరిగిన తప్పిదాలను సవరించే దిశగా అధికారులు ఆలస్యంగా తేరుకొని సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు పడుతున్నారు.


అంతా తప్పుల తడక (కరీంనగర్)

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఖరారైనా సంఖ్య మరింత పెంచాల్సి ఉంది. పట్టభద్రుల స్థానానికి కరీంనగర్‌- ఆదిలాబాద్‌-మెదక్‌-నిజామాబాద్‌ పాత జిల్లాల పరిధిలో 313, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 253 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో గతానికన్నా కేంద్రాలు పెరిగినప్పటికీ ఓటర్ల సంఖ్య సర్దుబాటు విషయంలో అక్కడక్కడా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ పట్టణంలో ఏకంగా 17 కేంద్రాలు ఉండగా అందులో ఒక్కో కేంద్రంలో వెయ్యికిపైగా ఓటర్లున్నారు. మరికొన్ని కేంద్రాల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ఓటర్లు ఓటేసేలా అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా కొన్ని మండల కేంద్రాల్లో ఒక్క కేంద్రమే ఉండటంతో ఆయా గ్రామాల్లోని వారంతా 20-30కి.మీ మేర ప్రయాణం చేసి ఓటు వేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ఓట్లు తమ మండలం కాకుండా ఇతర మండలాల్లోని కేంద్రాల్లో ఉండటంతో ఓటర్లు కంగుతింటున్నారు. పైగా ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని తెలుసుకోని వారి సంఖ్య అధికంగానే ఉంది. ఆయా పోలింగ్‌ కేంద్రాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చెంతన వీటిని ప్రదర్శించాలనే ఆదేశాలు అమలవడంలో లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తమ దృష్టికి వచ్చిన ఇక్కట్లను తొలగించేలా చొరవ చూపించాల్సి ఉంది.
ఇష్టానుసారంగా జాబితా ఉండటం, పోలింగ్‌ కేంద్రాల తారుమారు వ్యవహారంతో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టే వీలుంది.. సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగే ఈ ఎన్నికలపై పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు అంతంతమాత్రంగానే ఆసక్తి చూపిస్తారు. పైగా అనువైన చోట ఓటేసే అవకాశం లేకుంటే ఓటేసే విషయంలో నిర్లక్ష్యం చూపిస్తారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. గందరగోళంగా ఉన్న జాబితా సహా దూరభారంతో ఓటేయడానికి చాలా మంది వెనకడుగు వేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేవలం 37.38 శాతమే పోలింగ్‌ నమోదైంది. మొత్తం 64,586 మంది ఓటర్లకుగానూ 24,144 మంది మాత్రమే ఓటేశారు. దీంతో వచ్చేనెల 22న జరిగే ఎన్నికల్లో కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరగాలంటే ఎన్నికలకు ముందే జాబితాలో తప్పులను సవరించడం సహా అవసరమైన చోట కేంద్రాలను పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పట్టభద్రుల కేంద్రాల సంఖ్య 87గా ఉండగా.. మరికొన్ని స్థానాలు పెంచాలి. ఇదే తరహాలో 54 ఉపాధ్యాయ పోలింగ్‌ కేంద్రాలు కాస్తా మరో పదివరకు పెరిగితే ఓటర్లకు సౌలభ్యంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆయా పార్టీల నాయకులతోపాటు బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ఓటేసే విషయమై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. హక్కుని వినియోగించుకునేలా ప్రచారానికి సిద్ధపడుతున్నారు.