నీళ్లపై నిర్లక్ష్యం తగదు (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీళ్లపై నిర్లక్ష్యం తగదు (ఖమ్మం)

ఖమ్మం, మార్చి 8  (న్యూస్ పల్స్): 
ఉభయ జిల్లాల్లోని పట్టణ వాసుల తాగునీటి సమస్యను జఠిలం చేస్తున్నాయి. వేసవి కాలం సమీపించినా పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ప్రణాళికలను రచించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చర్యలకు ఉపక్రమించాల్సిన అధికార యంత్రాగం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వేసవికి ముందే ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సినా ఏవేవో సాకులతో వదిలేస్తున్నారు. పట్టణాల్లోని చాలా ప్రాంతాల్లో వేసవి అయితే చాలు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.  నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఉభయ జిల్లాల్లోని పట్టణాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 211 వార్డులున్నాయి. 1,71,406 గృహాల్లో దాదాపుగా 6.46 లక్షల మంది నివసిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అయితే 10.25లక్షల జనాభా ఉంది. రోజురోజుకూ పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది. కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఇబ్బడిముబ్బడవుతున్నాయి. పట్టణవాసులకు భూగర్భ జలాలు, తాగునీటి కాలువలు, చెరువులు, నీటి సరఫరా పథకాల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే వేసవిలో కాల్వల నీరు అందుబాటులో ఉండదు. భూగర్భ జలాలు అడుగంటుతాయి. 


 నీళ్లపై నిర్లక్ష్యం తగదు (ఖమ్మం)

వానాకాలం, చలికాలంలో నీరు వచ్చినట్టు బోర్ల నుంచి నీరు రాదు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు అధికంగా ఉంటాయి. మరోవంక నీటి అవసరం ఈ కాలంలోనే ఎక్కువ. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ప్రజలు నీటి ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. దూరభారాలకు వెళ్లి నీళ్లు పట్టుకురావటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు రాకుండా ప్రణాళికలు తయారు చేయాల్సిన పురపాలక అధికారులు ఇంకా మేల్కొనకపోవడం గమనార్హం. ఈ ఏడాది వేసవి నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయాలు చూపేందుకు రూపొందించాల్సిన ప్రణాళిక నేటికీ పాల్వంచ, కొత్తగూడెం పురపాలకాల్లో మినహా మిగిలిన ఏ కార్పొరేషన్‌, పురపాలకాల్లో రూపొందించలేదు.
వేసవికి ముందు పురవాసుల నీటి ఎద్దడి తీర్చేందుకు ఆరాటపడి ప్రణాళికలు రచించిన నిధులు విడుదల కావడం లేదు. రెండేళ్లుగా వేసవి ప్రణాళికలో తయారుచేసిన నిధులను నేటికీ ప్రభుత్వం విడుదల చేయడం లేదని కమిషనర్లు బహిరంగంగానే అంటున్నారు. దీంతో వేసవిలో పురపాలకంలో ఉన్న సాధారణ నిధులను వినియోగించి తూతూమంత్రంగా ట్యాంకరుతో నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. సమస్యాత్మక కాలనీల గుర్తింపు, చేతిపంపుల మరమ్మతులు, ఫ్లషింగ్‌, లీకేజీలు అరికట్టడం, అవసరమైతే కొత్త పైపులైను నిర్మించడం, మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటు, ఉపరితల భాండాగారాల మరమ్మతులు, శుభ్రపరచడం వంటి అంశాలను జనాభా ఆధారంగా రూపొందించాల్సి ఉన్నా అవేమీ జరగడం లేదు. పైన పేర్కొన్న అంశాలకు ఒక్కో దానికి ఎన్నెన్ని నిధులు ఖర్చు అవుతాయో నివేదికలను తయారు చేయాలి. ఈ విషయంలో కొత్తగూడెం, పాల్వంచలు, ఖమ్మంలో మాత్రమే ప్రణాళికలను రచించారు.
ప్రధాన పట్టణాల్లో నేటికీ మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాలేదు. ఉపరిత భాండాగారాల నిర్మాణాలు నిదానంగా సాగుతున్నాయి. మార్చి 31 వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. అంతర్గత పైపులైను నిర్మాణం పనులు నత్తనడకలా కొనసాగుతున్నాయి.