పోగాకు కొనుగోళ్లకు అంతా సిద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోగాకు కొనుగోళ్లకు అంతా సిద్ధం

ఒంగోలు, మార్చి 8, (way2newstv.com
ప్రకాశం జిల్లాలోని 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో ఈనెల 15 నుండి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కానుండటంతో జిల్లాలోని పొగాకు బోర్డు అధికారులు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది పొగాకు రైతులు అనేక ఆటుపోట్లను తట్టుకుని అధిక వ్యయాన్ని ఖర్చుచేసి పొగాకును పండించినందున వేలం కేంద్రాల ప్రారంభం నుండే పొగాకు రైతులకు గిట్టు బాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు బోర్డు అధికారులను పొగాకు రైతు సంఘాలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులకు మంచి ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు పొగాకు బోర్డు నల్లరేగడి నేలల ఆర్‌యం ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 120 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయాలని రైతులకు లక్ష్యంగా నిర్ణయించగా, అందులో ప్రకాశం జిల్లాలో సుమారు 82 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. 


పోగాకు కొనుగోళ్లకు అంతా సిద్ధం

అయితే ప్రకాశం జిల్లాలో పొగాకు వాతావరణం సరిగా అనుకూలించక పోవడంతో ఈ ఏడాది జిల్లాలో సుమారు కేవలం 56 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అయినట్లు బోర్డు అధికారుల ద్వారా సమాచారం. ఈ ఏడాది పొగాకు పంట పండించేందుకు గత సంవత్సరం కంటే అన్ని రకాల ఖర్చులు అధనంగా పెరిగాయి. ఖర్చులు అధనం పెరిగినప్పటికీ పొగాకు పంట ఉత్పత్తి బాగా తగ్గటంతో పొగాకు రైతులు పెట్టిన ఖర్చులు అయినా వస్తాయా లేదా అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఒక కిలో పొగాకుకు సరాసరి ధర 135రూపాయలు తగ్గకుండా గిట్టుబాటుధర ఇవ్వాలని,పొగాకు వ్యాపారులందరు పొగాకు కొనుగోళ్ళ ప్రారంభంనుండి పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలోని పొగాకురైతులు ఉత్పత్తిచేసిన పొగాకు మంచి నాణ్యతతో కూడి ఉంది. కనుక ఒక కేజి పొగాకుకు సరాసరి ధర 135రూపాయలు తగ్గకుండా ధర ఇవ్వాలని పొగాకురైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే ఈనెల 15వతేదీనుండి ప్రారంభమయ్యే పొగాకుబోర్డు వేలం కేంద్రాల్లో తొలుత రైతులకు సంబంధించిన తొమ్మిదినుండి 18 పొగాకు బేళ్లు వరకు కొనుగోళ్ళకు పెడ్తామని పొగాకు వ్యాపారులు ఇచ్చే ధరలను బట్టి అదనంగా పొగాకు బేళ్లను వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పొగాకుబోర్డు ఆర్‌ఎం ఉమామహేశ్వరరావుతెలిపారు.ఇదిలా ఉండగా పొగాకు వ్యాపారులు కూడా రైతుల పరిస్ధితులన అర్ధం చేసుకుని ఈ ఏడాది రైతులకు గిట్టుబాటుధరలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.