అమరావతి,మార్చి 29, (way2newstv.com)
ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
ఐపీఎస్ ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
వెంకటేశ్వరరావు సీఎం భద్రతను చూస్తారనీ, ఎన్నికల నిర్వహణతో ఆయనకు సంబంధం లేదని పిటిషన్ లో పేర్కోంది. పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేయడం సరికాదని వాదించింది. మరోవైపు ఈసీ న్యాయవాది స్పందిస్తూ.. ఈ బదిలీలు శిక్షలు కావని, తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని తేల్చిచెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న తరువాత కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.