అనంతపురం, మార్చి 20 (way2newstv.com)
అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ షాక్ తప్పేలా లేదు. కదిరి సీఐగా పనిచేసిన ఆయన జనవరి నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ ఆయనకు హిందూపురం టిక్కె్ట్ కేటాయించింది. అయితే నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్న ఆయనకు పోలీసు శాఖ షాకిచ్చింది. మాధవ్ దాఖలు చేసిన వీఆర్ఎస్‌ను ఉన్నతాధికారులు పెండింగ్‌లో పెట్టారు. పోలీసు శాఖ తీరుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ షాక్
ఈ పరిమాణాల నేపథ్యంలో హిందూపురం అభ్యర్థిని మార్చాలని వైసీపీ యోచిస్తున్నట్లు సమాచారం. మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం పొందకపోతే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. దీనికి తోడు నామినేషన్ ఇంకా కేవలం నాలుగు రోజుల సమయమే ఉండటంతో వైసీపీ ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జి కురుబ కిష్టప్ప పేరు తెరపైకి వచ్చింది.మాధవ్ నామినేషన్ తిరస్కరణకు గురైతే వెంటనే కిష్టప్ప చేత నామినేషన్ వేయించేలా వైసీపీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. మాధవ్ వీఆర్ఎస్‌పై కోర్టు స్పందన రాగానే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ భావిస్తోంది.