హైద్రాబాద్, ఏప్రిల్ 29, (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ఎమ్మెల్యేలు నక్కను తొక్కివచ్చినట్టున్నారు. వారు పట్టిందల్లా బంగారం అవుతోంది. పార్టీ మారితే మాకేమిటంటా? అని అడుగుతోన్న వారికి...మీరు అడిగితే మేము కాదంటామా? అన్న రీతిలో వీరి గొంత్తెమ్మ కోరికలను తీర్చడానికి పాలకపక్షం సిద్దపడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. భర్తతో ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం కూడా తెలిసిందే. ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించగానే వరంగల్ జిల్లా రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆమెకు ఇవ్వడానికి టీఆర్‌ఎస్ అధిష్ఠానం అంగీకరించింది. ఈ మేరకు గండ్ర జ్యోతి వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గండ్ర రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు ఆ పార్టీ అధిష్ఠానం నుంచి తీసుకున్న హామీ మేరకే గండ్ర జ్యోతికి శాయంపేట జడ్పీటీసీగా బరిలోకి దిగిందన్నది బహిరంగ రహస్యమే. గండ్ర జ్యోతి నామినేషన్ కార్యక్రమానికి ఆ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పాటు ఆ జిల్లా ముఖ్యనేతలంతా హాజరై కాబోయే జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమెకు అభినందనలు తెలపడం గమనర్హం.
పార్టీ మారే ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్లు
ఇలా ఉండగా ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్యకే కాకుండా ఆయనకు కూడా చీఫ్ విఫ్ పదవి ఇవ్వడానికి టీఆర్‌ఎస్ అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వల్లనే ఆమె పార్టీ మారినట్టు సమాచారం. తల్లి సబితాతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరిన ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల నుంచి పార్లమెంట్ టికెట్ ఆశించారు. అయితే అక్కడి నుంచి వేరే వ్యక్తికి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్తీక్‌రెడ్డిని ముందుగానే టీఆర్‌ఎస్ అధిష్ఠానం పిలిపించుకుని సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం వల్లనే ఎంపీ టికెట్ ఇవ్వలేకపోతున్నట్టు స్పష్టం చేసినట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ముందుగానే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి సండ్ర వీరయ్యకు టీఆర్‌ఎస్ సర్కార్ భారీ నజరానాకే అంగీకరించినట్టు తెలిసింది. ఖమ్మం పట్టణంలో సండ్ర వీరయ్య నివాసం ఉండే 1000 గజాల స్థలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి కాగా దీనిని సండ్ర పేరుమీద క్రమబద్దీకరణకు టీఆర్‌ఎస్ సర్కార్ అంగీకరించిన తర్వాతనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడానికి అంగీకరించారని తెలిసింది. ఈ స్థలం అధికారిక రిజిస్ట్రేషన్ విలువ రూ. 50 లక్షలు ఉండగా, ఒపెన్ మార్కెట్‌లో రూ. 5 కోట్ల పైనే ఉంటుందనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కావడానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీ శాసనసభా పక్షం విలీనం కావడానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ అధిష్ఠానం మంతనాలు జరపుతోన్నట్టు సమాచారం. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే తమకు కూడా భారీ ఫ్యామిలీ ప్యాక్ కోసం ఆ సదరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తోన్నట్టు తెలిసింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మరీ గొంత్తెమ్మ కోరికలు కోరడం వల్లనే వారి చేరిక జాప్యానికి కారణమని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.