హైద్రాబాద్, ఏప్రిల్ 29, (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో ఊహించని రీతిలో దోస్తీ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో, ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు `రిటర్న్ గిఫ్ట్` ఇవ్వాలనే లక్ష్యంతో...ఈ ఇద్దరు నేతలు ఆగర్భమిత్రుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ బంధం కారణంగానే, ఇప్పుడు ఒకరు చేసిన పనికి ఇంకొకరు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనికి వైఎస్ జగన్ సమాధానం ఇవ్వాల్సి వస్తోంది.ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తాజాగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేల మార్పిడిపై జగన్ బుక్
తెలంగాణలో ఫిరాయింపులు తీవ్ర స్థాయికి చేరుకోవడం, ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మెజార్టీ స్థానంలో ఉండటం... దీనిపై స్పీకర్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు తెలిసిన సంగతే. ఇదే అంశాన్ని పేర్కొంటూ జగన్ను విజయశాంతి ప్రశ్నించారు. ‘కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నేను జగన్ను అడిగేది ఒకటే... వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో గత రెండేళ్ల పాటూ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఏపీలో పార్టీల ఫిరాయింపుపై తిరుగుబాటు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్తో కలిసి, జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని జగన్ ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?’ అంటూ జగన్ తీరును ప్రశ్నించారు.ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ వివరణ ఇవ్వాలని రాములమ్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభ పెట్టడం జగన్ దృష్టిలో తప్పా, ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న నేత...తెలంగాణలో తమ పార్టీ తరహాలోనే విపక్షం ఎదుర్కుంటున్న సమస్యపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.