విజయవాడ, ఏప్రిల్ 29, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులందరూ అలసి పోయి ఉన్నారు. ఫలితాలు వెలువడటానికి ఇంకా ఇరవై అయిదురోజుల సమయం ఉండటంతో అందరూ రిలాక్స్ అవుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం నేతలను అంత ఈజీగా వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. మే నెల మొత్తం ప్రజల్లోనే ఉండాలని ఆయన అభ్యర్థులకు, పార్టీ క్యాడర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు కృతజ్ఞతలు తెలపాలని వారి ముందు కార్యాచరణ పెట్టారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
చంద్రబాబు లోకల్ బాడీ ఎలక్షన్స్ పై గురి
దీంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సంసిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్లోనే ఉండి మంచినీటి వంటి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను చేపట్టాలని కోరుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యిశాతానికి పైగా గెలుస్తామని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు కూడా తప్పుపట్టడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నది వాస్తవం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ స్థానిక సంస్థల సమరంలో తెలుగు తమ్ముళ్లను ఇన్వాల్వ్ చేసే పనిలో ఇప్పటి నుంచే పడ్డారు చంద్రబాబునాయుడు.మే నెల మొదటి వారం నుంచి చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలను చంద్రబాబు చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల వివరాలను పార్టీ కార్యాలయానికి పంపాలని చంద్రబాబు ఆదేశించారు. రోజుకు ఒకటి లేదా రెండు పార్లమెంటు స్థానాలను సమీక్షించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై చర్చించనున్నారు. కౌంటింగ్ రోజున ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.