హైద్రాబాద్, ఏప్రిల్ 29, (way2newstv.com)
కేసీఆర్ పార్టీ నడక సాగించిన తీరు, రాష్ట్రసాధనతోపాటు రాజకీయాధికారాన్ని చేజిక్కించుకున్న వైనం ఒక రికార్డు. తర్వాత క్రమంలో పార్టీని బలపరచుకునేందుకు పక్తు రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేయడం మరో చరిత్ర. ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నారని, నియంత అని విమర్శలు ఉండవచ్చు. తొలి అంకంలో ఉద్యమకారుడిగా సమయానుకూల ఎత్తుగడలు వేయడం, రెండో అంకంలో సామాజిక బలం లేని తన పార్టీని తిరుగులేని శక్తిగా మలచడం సాధారణ విషయాలు కాదు. అందుకే కేసీఆర్ మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ అతను అనుసరించే పంథా, ఎత్తుగడలు రాజకీయాల్లో పాఠాలే. ఉపన్యాసశైలి మొదలు ఉద్రేకపరిచే అంశాల వరకూ ఆయనదో అనితరసాధ్యమైన ప్రస్థానం. ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పార్టీ ఎదిగిన తీరు, జాతీయ పార్టీలను ఆకర్షించి అనుకున్నది సాధించినవైనం ప్రజాస్వామ్య చరిత్రలో గొప్ప అంశాలు. ఇప్పడు జాతీయ పార్టీలకు రాష్ట్రంలో చుక్కలు చూపిస్తున్న తీరు కేసీఆర్ రాజకీయ చాణక్యానికి నిదర్శనం.తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ పార్టీని ప్రారంభించారు, తప్పితే నిర్మాణానికి పెద్దగా కృషి చేయలేదు.
రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు
రాష్ట్ర ఏర్పాటు అనే అంశమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ కావడంతో ప్రజలే బతికించుకుంటూ వచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే వరకూ పార్టీకి గ్రామీణ స్థాయి నుంచి పక్కా నిర్మాణం లేదు. ఒకవేళ పార్టీ నిర్మాణంపై శ్రద్ధపెడితే అనవసర ముఠాతగాదాలు , హెచ్చుతగ్గులు వస్తాయని భావించారేమో. ఏవో కొన్ని పదవులు తప్ప పోలింగు బూత్ స్థాయి వరకూ కార్యకర్తలను కదిలించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అందుకే టీఆర్ఎస్ గెలుపోటములు స్వచ్ఛందంగా లభించినవే. పార్టీకి పెద్దగా సిద్ధాంతాలు లేవు. అయినా ప్రజలు విశ్వసించారు. అననుకూల వాతావరణం ఏర్పడిన ప్రతి సందర్బంలోనూ కేసీఆర్ ఎత్తుగడలకు పూనుకునేవారు. పార్టీ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తే చాలు, భావోద్వేగాలను ప్రేరేపించేవారు. ఆ రకంగా చూస్తే పార్టీ ఒన్ మ్యాన్ ఆర్మీగానే నడిచిందని చెప్పుకోవాలి. ఆయన చెప్పినదానిని మిగిలినవాళ్లు పాటించాల్సిందే. రాజీనామాల అస్త్రాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు అదిగదిగో తెలంగాణ అన్న ఒక మానసిక విశ్వాసాన్ని కలిగించగలిగారు. డెడ్ లైన్లు పెడుతూ ఆశను సజీవంగా ఉంచగలిగారు.తెలంగాణలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల దన్నుతో కాంగ్రెసు పార్టీ చాలా బలంగా ఉండేది. అలాగే వెనుకబడిన తరగతులు, సీమాంధ్ర సెటిలర్ల మద్దతుతో తెలుగుదేశం ప్రబలమైన శక్తిగా ఉండేది. తొలిదశలో టీఆర్ఎస్ కేవలం నాలుగు జిల్లాలకు పరిమితమైన చిన్న రాజకీయశక్తిగానే ఉండేది. 2004లో 26 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పార్టీ 2009 వచ్చేసరికి 10 స్థానాలకు పడిపోయింది. అయిదు ఎంపీ స్థానాల నుంచి రెండు ఎంపీ సీట్లకు కుదించుకుపోయింది. ఇదంతా రాజకీయ నిర్మాణంలో లోపాల కారణంగానే వచ్చింది. పార్టీ మూల లక్ష్యం బలహీనపడుతోందనే భావన వ్యాపించింది. రాష్ట్ర కాంగ్రెసులో వైఎస్ రూపంలో బలమైన లీడర్షిప్ ఏర్పడటంతో టీఆర్ఎస్ మనుగడకే ముప్పు వచ్చింది. వై.ఎస్. మరణానంతరం రాజకీయ నాయకత్వంలోని బలహీనతను సరిగ్గా అంచనావేయగలిగారు. నిరాహార దీక్ష రూపంలో ఉద్యమాన్ని మరోసారి పతాకస్థాయికి తీసుకెళ్లి 2014లో రాష్ట్రం ఏర్పడేలా చేసుకోగలిగారు. అదే వై.ఎస్. వంటి నాయకుడు ఉన్నప్పుడు ఉద్యమం చేపట్టి ఉంటే అణిచివేసే ప్రమాదం ఉండేది. మరోసారి తెలంగాణ గానం వినిపించడానికి దశాబ్దాల కాలం పట్టేది. సమయం చూసి ఎత్తుగడలు వేయడం కేసీఆర్ సక్సెస్ సూత్రం. రాజీనామాల వంటి సందర్భాల్లో కొన్నిసార్లు తన ప్రయోగం వికటించినా ఇష్యూ ను లైవ్ లీగా ఉంచడానికి తోడ్పడింది.తెలంగాణలో ఉన్న సీట్ల సంఖ్య 17. కానీ 543 స్థానాలతో ఉండే లోక్ సభలో ప్రధానపాత్ర పోషించాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. పైపైకి చూస్తే ఇది పరిహాసాస్పదంగా కనిపిస్తుంది. కానీ ఆ లక్ష్యం నిర్దేశించడంలోనే కిటుకు దాగి ఉంది. ప్రజల్లో తమ రాష్ట్ర అధినేత జాతీయంగా కీలకం కాబోతున్నారనే భావన కలిగిస్తే టీఆర్ఎస్ ను అంటిపెట్టుకుని ఉంటారు. జాతీయ పార్టీలను పక్కనపెడతారు. నిజానికి టీఆర్ఎస్ కు తెలంగాణలో సామాజిక పరమైన మద్దతు చాలా తక్కువ. రెడ్డి, ఎస్సీ,ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు ఇక్కడ జనాభా రీత్యా ప్రాబల్య శక్తులు. వీటిలో వేటికీ చెందని వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కేసీఆర్. జనాభాలో కేవలం 1శాతానికి మాత్రమే పరిమితం. ఈ స్థితిలో దీర్ఘకాలంగా తెలంగాణ సమాజంపై పెత్తనం చేస్తున్న రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు బీసీలను చేరదీశారు. పథకాలు పెట్టారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానంటూ వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. అసదుద్దీన్ తో చేతులు కలిపి ముస్లిం వర్గాలను ముగ్గులోకి తెచ్చుకోగలిగారు. రాష్ట్రసాధనతోనే లక్ష్యం పూర్తయ్యింది. దాంతో సామాజిక వర్గాలు మళ్లీపైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. అందుకే బంగారు తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా టీఆర్ఎస్ మాత్రమే దానిని నెరవేర్చగలదనే ఆశలు కల్పించారు. అయిదేళ్ల పాలన తర్వాత బంగారు తెలంగాణ నినాదం పెద్దగా పనిచేయదు. అందుకే జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో జాతీయంగా టీఆర్ఎస్ కీలకమవుతుందనే నినాదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే టీఆర్ఎస్ తెలంగాణలో అద్వితీయశక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు.