బరిలో వారసులు ( కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బరిలో వారసులు ( కర్నూలు)

కర్నూలు, ఏప్రిల్ 1(way2newstv.com)
జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కో ప్రధాన రాజకీయ కుటుంబం నుంచి ఒక్కో వారసుడు ఎన్నికల బరిలోకి దిగారు. తొలిసారి పోటీ అయినా, భిన్నంగా ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తండ్రులకు తగ్గ తనయులుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. జిల్లాలో కేఈ, టీజీ, భూమా, గుంగుల, శిల్పా కుటుంబాల నుంచి వారసులుగా యువ నాయకులు ఎన్నికల పోరులో సై అంటున్నారు. మంత్రి అఖిల ప్రియ గతంలో ఏకగీవ్రంగా ఎన్నిక కాగా, ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
ఎంపీ టీజీ వెంకటేష్‌ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన టీజీ భరత్‌ యువతను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే క్రీడలు, యువతకు వివిధ పోటీలు పెడుతూ వారికి చేరువయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు విజన్‌ యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? సమస్యలు ఏమిటని? అడిగి తెలుసుకుంటున్నారు. 


బరిలో వారసులు ( కర్నూలు)

ఇప్పటికి 69 రోజులుగా నగరంలోని వార్డుల్లో పర్యటించి సుమారు 2,300 సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యంగా మురుగు కాల్వలు, మంచినీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి వాటికి హామీలిస్తున్నారు. కర్నూలు నగర ప్రజలకు తాను ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో ఒక మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికల సన్నాహక సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మేనిఫెఫస్టో చేసిన విధానంపై సీఎం భరత్‌ను అభినందించారు. నిన్న, మొన్నటి వరకు కర్నూలు అభ్యర్థి ఎవరని తెలియక సందిగ్ధంలో ఉన్న క్యాడర్‌తోపాటు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను ఆహ్వానించి అండగా ఉంటానని హామీ ఇస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఆసక్తికర పోరు జరిగే నంద్యాల అసెంబ్లీ స్థానానికి వైకాపా తరఫున శిల్పా మోహన్‌రెడ్డి బదులు ఆయన వారసుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఎంబీఏ పూర్తి చేసిన రవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇదే మొదటిసారి. తండ్రి బాటలో నడుస్తూ.. ఇంటింటి ప్రచారాలకే మొగ్గు చూపుతున్నారు. మేనేజ్‌మెంట్‌ విద్యార్థి అయిన రవి తెదేపా నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలు చేపట్టి పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌గా పేరు సంపాదించారు.
భూమా కుటుంబం నుంచి రెండో తరంలో అఖిలప్రియ పోటీకి దిగారు. ఆళ్లగడ్డలో గత ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన ఆమె తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఆళ్లగడ్డకు తన కుటుంబం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో ఐదు సార్లు గెలుపొందిన శోభా నాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డిలను గుర్తు చేస్తూ...ఈసారి ఎన్నికల్లో తాను కాదు శోభమ్మ నిలబడింది అంటూ వ్యూహాత్మకంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లతో చేపట్టినట్లు, ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చానని, మిగిలిన హామీలు నెరవేర్చేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అఖిలప్రియ కోరుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డిజిటల్‌ ప్రచార రథాలతో గ్రామాలను చుడుతున్నారు.
అదే ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం నుంచి తెర పైకి వచ్చిన వారసుడు గంగుల బ్రిజేంద్రరెడ్డి(నాని). ఇప్పటికే కావాలి జగన్‌..రావాలి జగన్‌ కార్యక్రమం పేరుతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేశారు. ముందస్తు ప్రచారంలో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా తెదేపా నుంచి వర్గ నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో క్యాడర్‌ను ఆకట్టుకునేందుకు స్థానికంగా ఉంటూ కొత్త పంథాలతో ముందుకెళ్లారు.