మహబూబ్ నగర్, ఏప్రిల్ 30 (way2newstv.com):
నగర ప్రాంతాల్లోని పేదల కోసం ప్రభుత్వం అన్నపూర్ణ పథకాన్ని అమలు చేస్తోంది. నగరాల్లో రూ. 5లకే అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించడం పేదలకు వరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పనిచేసి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు మాత్రం మార్కెట్ యార్డుల్లో కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం రెండేళ్ల కిందట ‘సద్దిమూట’ పేరుతో మార్కెటింగ్‌శాఖ రూ. 5లకే భోజనం అందించే పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక నిధులు కేటాయించనుంది. స్వచ్ఛంద సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. దేవరకద్ర మార్కెట్‌లో కూడా ప్రారంభించాలని పాలకవర్గం మార్కెటింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు నాలుగు నెలల కిందట మార్కెట్ యార్డును సందర్శించారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ మాత్రం సద్దిమూట పథకాన్ని ప్రారంభించ లేదు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే దేవరకద్ర మార్కెట్ యార్డుకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి మార్కెట్ యార్డుకు దేవరకద్ర, మరికల్, చిన్నచింతకుంట, ధన్వాడ, కోయిలకొండ మండలాల నుంచి ఖరీఫ్, రబీల్లో రైతులు పండించిన వరి, వేరుశనగ, ఆముదం, కందులు, ఉల్లి వంటివి తీసుకువచ్చి వందలాది మంది రైతులు విక్రయిస్తుంటారు.
అటకెక్కిన సద్దిమూట (మహబూబ్ నగర్)
దూర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని విక్రయించేందుకు కొందరు రైతులు తెల్లవారుజామునే ఇక్కడికి తమ సరకుతో చేరుకొంటారు. మరికొందరు తమ సరకుకు కాపలాగా రాత్రివేళలో ధాన్యం వద్దే నిద్రిస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు సీజన్ల వారీగా దిగుబడి వస్తుంటుంది. ఖరీఫ్, రబీ సీజన్‌లో నిత్యం లావాదేవీలు జరుగుతుంటాయి. రైతులు పండించిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వాటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో బాదేపల్లి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, వనపర్తి జిల్లాలో వనపర్తి, పెబ్బెరు, మదనాపురం, గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజ, నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌లలో మార్కెట్ యార్డులు ఉన్నాయి. బాదేపల్లిలో ఏడాదికి రూ.1.50కోట్ల ఆదాయం రాగా, మహబూబ్‌నగర్‌లో రూ.1.20కోట్లు, దేవరకద్రలో రూ.65 లక్షలు, నారాయణపేటలో రూ.55 లక్షలు, వనపర్తి జిల్లాలో వనపర్తిలో రూ. కోటి ఆదాయం, పెబ్బేర్‌లో రూ. 40 లక్షలు, మదనాపురంలో రూ. 50 లక్షలు, జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాలలో రూ. 2.50 కోట్లు, అలంపూర్‌లో రూ. కోటి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌లో మార్కెట్ యార్డులు ఉండగా వాటి నుంచి రూ. 5.60 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ఒక్కో మార్కెట్‌యార్డులో సుమారు 250కి పైగా రైతులు, 300 ఇతరులు లావాదేవీల నిర్వహణలో పాలుపంచుకుంటారు. తాగునీటి వసతి, భోజన వసతి కల్పిస్తే రైతులు ఇతర సిబ్బందికి ఎంతో ఊరట ఉండనుంది. మార్కెట్ యార్డులో రూ. 5లకే భోజనం అందిస్తే వారందరి ఆకలి తీర్చినట్లుతుంది.