హైదరాబాద్ మే 6 (way2newstv.com)
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ శైలే వేరు. తను చేసే ప్రతి పనికి ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన మీదకు మళ్లించుకుంటారు.. మళ్లీ కొన్నాళ్లు సైలెంట్ అయిపోతారు.. మళ్లీ హైప్ క్రియేట్ చేస్తారు.. ఇలా ప్రత్యర్థులకు అందని రాజకీయ చతురతతో తనదైన శైలిలో ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ చేపట్టిన దక్షిణభారతదేశ యాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వామపక్షాలను కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవానికి గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన వచ్చినప్పుడు వామపక్షాలను అందులోకి చేర్చుకోవాలన్న విషయాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన పూర్తిగా ప్రాంతీయ పార్టీలపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్‌లోకి వామపక్షాలను తీసుకురావాలన్న వ్యూహం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది.కాంగ్రెస్‌కు, వామపక్షాలకు బలమైన సంబంధం ఉంది. కేంద్రంలో ఈ రెండు పార్టీలు కలిసి సాగుతున్నాయి.
వామపక్షాలను టార్గెట్ చేసిన కేసీఆర్
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు ఎప్పట్నుంచో కలిసి సాగుతున్నాయి. యూపీఏ-1 హయాంలో అమెరికాతో న్యూక్లియర్ డీల్ విషయంలో విభేదించి బయటకు రావడం మినహా కాంగ్రెస్‌కు అండగానే వామపక్షాలు ఉన్నాయి. ఆ నిర్ణయంలో వామపక్షాల్లోనే భిన్నాభిప్రాయాలు రావడం.. ఆ తర్వాత నుంచి వామపక్షాలు దేశంలో బలహీనంగా తయారవ్వడంతో కామ్రేడ్లు కూడా మారారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపాదించిన కాంగ్రెస్ సారథ్యంలోని బీజేపీయేతర ఫ్రంట్ల్‌తో వామపక్ష నేతలు కలిసి నడుస్తున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య మరోసారి దూరం పెరిగింది. కేరళలో తాము అధికారంలో ఉంటే.. ఒకవైపు మిత్రధర్మం అంటూనే మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేరళలో కలహించుకుంటున్నప్పటికీ.. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు పలుకుతున్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు అవసరమైతే ఇచ్చేందుకు కూడా వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతుగా నిలుస్తున్న సమయంలో కేసీఆర్ మాత్రం కేరళ వెళ్లి సీపీఎం నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమై ఫెడరల్ ప్రంట్‌పై చర్చించడంపై సర్వత్రా చర్చనీయాంశంమైంది.
నిజానికి వామపక్షాలను తమ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలనుకుంటే.. ఢిల్లీకి వెళ్ళి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరి వంటి పార్టీ కీలక నేతలు కలవాలి. కాని సురవరం, ఏచూరి కాదని..అలాకాకుండా కేరళ వెళ్లి పినరయి విజయన్ కలవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు స్పష్టవుతోంది. సురవరం, సీతారాం ఏచూరి వంటి నేతలు తెలంగాణలో కేసీఆర్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి స్వయంగా తెలంగాణకు చెందిన వ్‌లక్తి. ఏచూరితో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నారు. వీరివురిని కలిసినా.. ఫెడరల్ ఫ్రంట్‌లో వామపక్షాలు వచ్చే అవకాశం దాదాపుగా సున్నా. అందుకే ఢిల్లీ నుంచి కాకుండా కేరళ నుంచి నరుక్కురావాలని కేసీఆర్ ప్లాన్ వేశారు. అదీగాక రాహుల్‌గాంధీ వయనాడ్‌లో పోటీ చేయడంపై కేరళకు చెందిన సీపీఎం, సీపీఐ నేతలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో పొత్తు కుదిరినా.. కేరళలో మాత్రం రెండు పార్టీలు కలహించుకునే పరిస్థితి. అందుకే జాతీయ స్థాయిలో కలిసినా.. ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో ఒక రాష్ట్రం నుంచి చర్చలు ప్రారంభించాలని కేసీఆర్ ఎత్తుగడగా కనిపిస్తోంది. విజయన్ ద్వారా కేసీఆర్ తన స్ట్రాటజీని వామపక్ష నేతలను వివరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వామపక్షాలు తమ విధానాలను జాతీయ స్థాయిలో తీసుకుంటాయి. అలాకాకుండా కేరళలో పినరయి విజయన్ ఒప్పుకున్నంత మాత్రానా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను వదులుకుని కేసీఆర్‌తో కలిసి వెళ్లేందుకు వామపక్షాలు సిద్ధపడకపోవచ్చు. అదీగాక తెలంగాణలో వామపక్షాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.