హైద్రాబాద్, మే 8, (way2newstv.com)
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మరోసారి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్న సీఎం కేసీఆర్.. సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ నెల 13న ఆయన డీఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ ఉండకపోవచ్చునని డీఎంకె వర్గాలు చెబుతున్నాయి.తమిళనాడులో ఈ నెల 19న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండనున్నారు. దీంతో కేసీఆర్‌తో భేటీ కుదరకపోవచ్చునని అంటున్నారు.
కేసీఆర్ కు స్టాలిన్ షాక్
అయితే ముందు నుంచి కాంగ్రెస్‌తో దోస్తీ నెరుపుతూ వస్తున్న స్టాలిన్.. కావాలనే కేసీఆర్‌తో భేటీకి సుముఖత చూపడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డీఎంకె.. భవిష్యత్‌లోనూ కాంగ్రెస్ వెంటనే ఉండాలనుకుంటోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని స్టాలిన్ సైతం ఇదివరకు పలుమార్లు తన ఆకాంక్షను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ను ప్రతిపాదిస్తున్న కేసీఆర్‌తో ఆయన చేతులు కలపకపోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది.ఇదిలా ఉంటే, త్వరలోనే కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, మరో యూపీ మాజీ సీఎం మాయావతి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలవబోతున్నట్టు సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్.. ఢిల్లీని ప్రాంతీయ పార్టీలు శాసించాలంటే జాతీయ పార్టీలను పక్కనపెట్టి అంతా ఏకమవాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఎజెండా ఖరారు చేసుకుని ముందుకు వెళ్దామన్న ప్రతిపాదనను వారి ముందు పెట్టబోతున్నారు