ఆదిలాబాద్, మే 6 (way2newstv.com):
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల పర్యవేక్షణ అధికారులకు భారంగా మారుతోంది. రెగ్యులర్ విధులతో పాటు ఇన్‌ఛార్జి బాధ్యతలు సైతం నిర్వహించాల్సి వస్తుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఇబ్బందులు తప్పటం లేదు. జిల్లా పరిధిలో ఉన్న పలు ఆలయాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. దూరాభారం, వ్యయప్రయాసలతో పాటు పనిఒత్తిడిని అధిగమించడానికి ఉద్యోగులు తంటాలుపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆలయాల్లో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అటు అధికారులు, ఇటు భక్తులు ఇబ్బందులు పడాల్సివస్తోంది.దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలను పర్యవేక్షించడానికి, సంరక్షణ బాధ్యతలు చూసేందుకు డివిజన్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా పరిధిలో ఒకే ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. ఇతనికి సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల బాధ్యతలు సైతం అదనంగా అప్పగించారు. ఫలితంగా అన్ని ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. ఈ నాలుగు జిల్లాల పరిధిలో 88 ఆలయాలున్నాయి. ఇందులో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, గూడెం సత్యనారాయణస్వామి ఆలయాలు సైతం ఉన్నాయి.
దైవమే భారం (ఆదిలాబాద్)
ఆలయాల్లో జరిగే హుండీ లెక్కింపు సమయంలో వాటిని తెరవడం, డబ్బులు జాగ్రత్తగా లెక్కించి, వాటిని ఆలయ ఖాతాల్లో జమచేయడం, ఆ తర్వాత హుండీలకు సీల్‌వేయడం, ఏవైనా ఉత్సవాలు, జాతరలు, పండగలు నిర్వహించాల్సి వస్తే ఆ సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం, బందోబస్తు ఏర్పాట్లు చూడటం, ఆలయ ఆస్తులను పరిరక్షించడం, భూములుంటే వాటిని అద్దె ప్రాతిపదికన కేటాయించడం.. ఇత్యాది వ్యవహారాలన్నీ ఈయనే చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఆలయాలతో పాటు సుప్రసిద్ధ ఆలయాలు సైతం మెండుగా ఉండటంతో అన్నింటినీ ఏకకాలంలో పర్యవేక్షించడం అసాధ్యమే.ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న వ్యక్తికే నిర్మల్ జిల్లా పరిధిలోని పలు ఆలయాల బాధ్యతలను సైతం అప్పగించారు. అడెల్లి మహాపోచమ్మ, కాల్వ లక్ష్మీనరసింహస్వామి, కదిలి పాపహరేశ్వరాలయం, నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆలయాలకు ఆయనే ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయాల పరిధిలో ఏవైనా టెండర్లు నిర్వహించడం, ఆలయ కార్యకలాపాలు కొనసాగించడం, వివిధ ఉత్సవాలు, దాతల నుంచి సేకరించే విరాళాలు, వచ్చిన నిధులు, అయిన ఖర్చులు, నిత్యం ధూపదీప నైవేద్యాల సమర్పణ.. తదితర అంశాలన్నీ ఈయన పరిధిలోనే ఉంటాయి. ఆలయానికి సంబంధించిన అన్నిరకాల వ్యవహారాలు ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అయిదు ఆలయాల బాధ్యత ఉండటంతో ప్రతీ ఆలయంలోనూ ఈ అంశాలన్నీ పరిశీలించే అవకాశం లేక కొన్ని సందర్భాల్లో ఆలయ కమిటీ సభ్యులకే అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలు బోలెడు. తాజాగా నిర్మల్‌లోని దేవరకోట ఆలయంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని, ఆలయ కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులు పేర్కొనడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఉత్సవాల సమయంలో దాతలు ఇచ్చే విరాళాలపై స్పష్టత కరవవుతోంది. వచ్చేది ఎంత, జమవుతోంది ఎంత, ఖర్చవుతోంది ఎంత.. ఇలా అన్ని వివరాలు సక్రమంగా ఉంటున్నాయా అనే అనుమానాలు భక్తుల్లో ఏర్పడుతున్నాయి. అధికారులు పూర్తిసమయం అందుబాటులో ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకావని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.