శ్రీకాకుళం, మే 6(way2newstv.com):
జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ట్రిపుల్‌ఐటీ మంజూరు చేసింది. నవ్యాంధ్ర రాష్ట్రంలో అప్పటి వరకు రెండు ట్రిపుల్‌ఐటీలు -నూజివీడు, ఇడుపులపాయల్లో- ఉండగా.. అదనంగా మరో రెండు ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి జిల్లాకు కేటాయించింది. ట్రిపుల్‌ఐటీ రాకతో జిల్లా విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుతుందని అంతా ఆశించారు. కానీ, నేటికీ భవనాల నిర్మాణమే ప్రారంభం కాకపోవడంతో పూర్తిస్థాయిలో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటులో జాప్యంతో ఆ ఆశలు అడియాసలుగానే మిగులు తున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన నిరుపేద, మద్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని 2016లో ఏర్పాటుచేశారు. ట్రిపుల్‌ఐటీ జిల్లాకు కేటాయించినా.. తగిన వసతి, ఇతర సౌకర్యాలు తక్షణమే ఏర్పాటు చేయటం కుదరకపోవటంతో తాత్కాలికంగా నూజివీడులో 2016-17 విద్యా సంవత్సరంలో 1000 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యాచ్ విద్యార్థులు పీయూసీ 1, 2 పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం నూజివీడులోనే చదువుతున్నారు. 2017-18 విద్యాసంవత్సరంలో రెండో బ్యాచ్‌కు ప్రవేశాలు కల్పించిన అధికారులు ఈ బ్యాచ్‌కు ప్రథమ సంవత్సరం తరగతులు నూజివీడులో నిర్వహించారు.
ఇంకెన్నాళ్లు..? (శ్రీకాకుళం)
ద్వితీయ సంవత్సరం అంటే పీయూసీ-2 తరగతులు జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో మూడో బ్యాచ్‌కు ప్రవేశాలు కల్పించగా.. ఈ బ్యాచ్‌కు ప్రస్తుతం నూజివీడులో పీయూసీ-1 తరగతులు జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో (2019-20) నాలుగో బ్యాచ్‌కు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లకు ప్రవేశాలు కల్పించగా.. వచ్చే ఏడాది మొత్తం నాలుగు బ్యాచ్‌లు కానున్నాయి. ట్రిపుల్‌ఐటీ ఏర్పాటయిన ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మొత్తం ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు అక్కడే తరగతులు కొనసాగించేందుకు అధికారులు నిర్ణయించారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన బ్యాచ్‌తో కలిపి మొత్తం మూడు బ్యాచ్‌లకు వేసవి సెలవుల అనంతరం జిల్లాలోనే తరగతులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. దీనికి తగిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకొని పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పీయూసీ-2 బ్యాచ్‌కు బాలికలకు షేర్‌మహ్మద్‌పురం ప్రాంగణంలోనూ, బాలురకు చినరావుపల్లి వద్ద మిత్ర ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో తరగతులు జరుగుతున్నాయి.ట్రిపుల్‌ఐటీకి కేటాయించిన 200 ఎకరాల్లో ఆరు బ్యాచ్‌లకు ఆరు క్లస్టర్లు నిర్మించేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని గత ఏడాది పనులు చేపట్టేందుకు ఉపక్రమించగా స్థానిక రైతుల నుంచి అభ్యంతరం వచ్చింది. తమకు దశాబ్దాల క్రితం ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని.. వాటికి ఎటువంటి పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకొంటే ఒప్పుకొనేది లేదంటూ రైతులు పనులు ముందుకు సాగనివ్వలేదు. ట్రిపుల్‌ఐటీ అధికారులకు పలు దఫాలు సమస్య విన్నవించి సమస్య పరిష్కారమయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టింది. నిర్మాణపనుల ప్రారంభమే ఆలస్యమైంది. ప్రస్తుతం మిత్రా ఇంజినీరింగ్ కళాశాలను ఆనుకొని ఉన్న శ్రీశివాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను ట్రిపుల్ ఐటీ అధికారులు లీజుకు తీసుకొనేందుకు నిర్ణయించారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ కళాశాలలో ఒక ఇంజినీరింగ్ బ్యాచ్ కొనసాగించేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం.. లీజుకు తీసుకొన్న కళాశాలలోనే స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసి.. ఈవీఎంలు భద్రపరచటంతో ఆ ప్రాంగణానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సకాలంలో పనులు జరిగేందుకు సరికొత్త అవరోధం ఏర్పడింది.ట్రిపుల్ ఐటీకి కేటాయించిన 200 ఎకరాల్లో ఆరు వేల మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి సరిపడేలా రూ. 800 కోట్లతో భవనాలు, క్రీడా మైదానలు, ప్రయోగశాలలు అన్నింటినీ నిర్మించేందుకు అధికారులు బృహత్ ప్రణాళిక తయారుచేశారు. తొలి విడతలో రూ. 86.74 కోట్లతో నాలుగు క్లస్టర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఒక క్లస్టర్‌కు సంబంధించి 1200 మంది విద్యార్థులకు సరిపడేలా రూ. 24 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన క్లస్టర్ల నిర్మాణానికి ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. ఈ పనులు దాదాపు 60 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నాటికి వీటిని పూర్తిచేసి కొత్తగా ప్రవేశాలు పొందుతున్న నాలుగో బ్యాచ్‌కు ఇక్కడ తరగతులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో తరగతులు నిర్వహిస్తున్న పీయూసీ-2 బ్యాచ్ వచ్చే ఏడాది ఇంజినీరింగ్ తరగతులకు వెళ్తుంది. వీరికి లీజుకు తీసుకొన్న శ్రీశివాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తరగతులు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. అధికారుల ముందుస్తు ప్రణాళిక బాగున్నా సకాలంలో నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. రూ. 24 కోట్లతో నిర్మిస్తోన్న క్లస్టర్‌లో భోజనశాలల పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వసతిగృహాలు, తరగతి గదుల విషయాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మూడు నెలల్లో తరగతుల నిర్వహణకు సరిపడేలా భవనాలను సిద్ధం చేసే పరిస్థితి కనపించటం లేదు. భవనాల నిర్మాణమే కాకుండా తాగునీరు సౌకర్యం కల్పించే పనులు కూడా ఇంకా చేపట్టాల్సి ఉంది. అధికారులు మాత్రం సకాలంలోనే పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.