పనులెప్పుడు..? (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పనులెప్పుడు..? (పశ్చిమగోదావరి)

ఏలూరు, మే 6 (way2newstv.com):
పశ్చిమ డెల్టా పరిధిలో కాలువలను మూసివేసి రెండు వారాలు దాటినా ఇంకా పనులు ఊపందుకోలేదు. అక్కడక్కడా రెండు మూడు పనులు మాత్రమే మొదలయ్యాయి. రూ.32 కోట్లతో పంట కాలువలు, రూ.10 కోట్లతో మురుగు కాలువలపై మొత్తంగా కలిపి రూ.42 కోట్ల పనులు చేపట్టాలి. అందులో కొన్ని కొత్తవి కాగా.. మరికొన్ని గతంలో టెండర్లు ఖరారై మొదలుకు నోచుకోకపోవడం.. ఇంకొన్ని అసంపూర్తి దశలో నిలిచిన పాత పనులే. వీటిని నూరు శాతం పూర్తిచేయాలనే లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. అందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుత క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే నరసాపురం ప్రధాన కాలువతోపాటు మరికొన్ని కాలువల్లో ఇంకా నీటి ప్రవాహం పూర్తిగా తగ్గలేదు. నీరు అడుగంటాలంటే మరి కొన్ని రోజులు పడుతుంది. అంటే అప్పటికీ కాలువలకు నీరు వదిలిపెట్టే గడువు 27 రోజులు మాత్రమే ఉంటుంది. ఈలోగా జలవనరులశాఖ పంట కాలువలపై తలపెట్టిన పనులను పూర్తి చేయాలి. లేకుంటే చిన్నా చితక లాంటి పనులతో సరిపెట్టుకోవాల్సిందే. మొదటి నుంచి టెండర్ల ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మొత్తంలో పనులు టెండర్‌ ఖరారు కాలేదని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.కాలువలపై కీలక పనులు ఈ ఏడాది జరిగేలా లేవు. నరసాపురం ప్రధాన కాలువపై జిన్నూరు వంతెనకు అనుసంధాన రహదారి పనులు పూర్తయ్యేలా లేవు. 


పనులెప్పుడు..? (పశ్చిమగోదావరి)

రెండేళ్లుగా పని పూర్తిచేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నా ఒక్కడుగు ముందుకు పడలేదు. ఇదే కాలువపై సాయిబాబా ఆలయం వద్ద చేపట్టాల్సిన కాంక్రీట్‌ గోడ నిర్మాణ పనులు అసంపూర్తి నిలిచాయి. ఈ కాలువతోపాటు ఉపకాలువలపై పలుచోట్ల పాడైన హెడ్‌ స్లూయిస్‌, డ్యామ్‌ల మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. కాకరపర్రు వద్ద కాంక్రీట్‌ గోడ నిర్మాణం చేపట్టాలి. నీరు వృథాగా పోకుండా అవసరమైన చోట్ల అధికారిక తూరలు ఏర్పాటు చేయడంతోపాటు అనధికార తూరలను తొలగించాలి. పలుచోట్ల ప్రతిపాదించిన వంతెన పనులు జరగాల్సి ఉంది. ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం జలవనరులశాఖ ఉప విభాగాల పరిధిలోని కాలువలపైన రూ.కోట్ల పనులు కొత్తవితోపాటు పాతవి ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా కాలువలపై మట్టి తవ్వకం పనులు చేపట్టాలి.ఇది పాలకొల్లు దాసరి వంతెన సమీపంలో నరసాపురం ప్రధాన కాలువ దుస్థితి. పదేళ్లకు పైగా ఈ ప్రాంతంలో మట్టి తవ్వకం పనులు చేపట్టకపోవడంతో దాసరి వంతెన నుంచి సాయిబాబా ఆలయ ప్రాంతం వరకు మట్టి, చెత్తాచెదారంతో గుట్టలుగా పేరుకుపోయింది. అక్కడక్కడ పెద్దపాటి రాళ్లు, చెట్ల కొమ్మలు వంటివి పడి ఉన్నాయి. దీనివల్ల నీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఏటా తవ్వకం పనులు చేపట్టేందుకు అంచనాలు తయారు చేస్తున్నా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఈసారి అనుమానంగానే ఉంది. ఈ ఒక్క పనే కాదు. పలు ప్రధాన, చిన్నపాటి కాలువలపై ప్రతిపాదించిన పనులు పెద్దగా ముందుకెళ్లే పరిస్థితి లేదు.కాలువలపై కొద్దిపాటి పనులు హడావుడిగానే జరుగనున్నాయని భావిస్తున్నారు. కొందరు గుత్తేదారులు కావాలనే కాలువలకు నీరు వదిలే చివరి రోజుల్లో పనులు చేసి చేతులు దులుపుకొంటారు. దీంతో ఆ పనుల్లో అధిక లాభాలు గడిస్తుంటారు. జరుగుతున్న పనుల పైనా సంబంధిత అధికారుల పర్యవేక్షణ తక్కువగానే ఉంటుంది. పంట కాలువ పనుల్లో కొంత మెరుగు కనిపించినా మురుగు కాలువ పరిస్థితి మరీ దారుణం. ఆయా పనులు జరుగుతున్నప్పుడు చూసే నాథుడే ఉండరు. పని అంచనాలు, వివరాలు వంటివి అడిగినా చెప్పలేని పరిస్థితుల్లో కొందరు ఇంజినీరింగ్‌ అధికారులు వ్యవహరిస్తుంటారు. కనీసం పనులపై సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కనిపించదు.