కర్నూలు, మే 7, (way2newstv.com)
ఏపీలో ఈ సాధారణ ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా జరిగాయి. నవ్యాంధ్ర ఏర్పడిన తొలి ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ద్విముఖ పోరు జరగగా ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన ఎంట్రీతో మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. గత ఎన్నికల కంటే భిన్నంగా ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ సహజంగా ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువగా జరుగుతుందని అందరూ భావిస్తుంటారు. ఈ ఎన్నికల్లో అందుకు భిన్నంగా రాయలసీమలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ వేసిన ఎత్తుగడతో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందన్నది వాస్తవం. సీమలోని అనంతపురం, హిందూపురం, కర్నూలు ఎంపీ సీట్లను వైసీపీ బీసీలకు ఇచ్చింది. ఇది చాలా ప్రయోగాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయంతో సీమలో ఎక్కువ సంఖ్యలో ఉండే బీసీ సామాజికవర్గాలలో చాలామంది ఎంపీకి తమ సామాజిక వర్గం అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓట్‌చేసినట్టు పోలింగ్ సరళి చెబుతోంది.
కర్నూలులో క్రాస్ ఓటింగ్
ఇక కీలకమైన కర్నూలు ఎంపీ సీటును గత ఎన్నికల్లో టిడిపి, వైసిపి రెండూ బీసీలకు ఇవ్వగా చేనేత సామాజికవర్గానికి చెందిన వైసిపి అభ్యర్థిని బుట్ట రేణుక ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు సీటు లేదు… గీటు లేదని చెప్పడంతో చివరకు ఎన్నికలకు ముందు తిరిగి పాత ఇల్లు వైసీపీ గూటికి చేరిపోయారు. ఎన్నికల్లో టిడిపి నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. వైసిపి మళ్లీ చేనేత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్‌ను రంగంలోకి దింపింది. వైసిపి రెండు సార్లు బీసీలకే సీటు ఇవ్వడం ఒక ఎత్తు అయితే…. టీడీపీ గత ఎన్నికల్లో బీసీలకు సీటు ఇచ్చి ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన కోట్లను రంగంలోకి దించడం బీసీల్లో మార్పుకు కారణం అయ్యింది. ఇక ఆలూరులో నిన్నటి వరకు పని చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని కోట్ల భార్య సుజాతమ్మకు బాబుకు సీటు ఇచ్చారు. ఇది కూడా ఆ నియోజకవర్గంలో టిడిపికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఆలూరు నియోజకవర్గంలో ఈ సారి బీసీలంతా ఏకమై టీడీపీ తమ వర్గానికి చెందిన అభ్యర్థిని పక్కన పెట్టడంతో వారంతా వైసీపీకే ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కోట్లను టీడీపీలోకి తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయించినా స్థానికంగా కేఈ ఫ్యామిలీతో కోట్ల ఫ్యామిలీకి ఉన్న వైరం నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఈ రెండు వర్గాలు పూర్తిగా కలిసినట్టు కనపడడం లేదు. ఇవి కూడా కోట్లకు మైనస్‌గా మారాయి. రాయలసీమలో బీసీల ఓట్లు అంటే తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా పట్టు కొమ్మలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం బిసి ఓట్లలో కొన్ని వర్గం ఓట్లను వైసీపీ దక్కించుకుంది. సీమలో ఇప్పటికే వైసీపీకి సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు బీసీ ఓటు బ్యాంకుకు తోడు అయితే కర్నూలు జిల్లాలో మళ్లీ టీడీపీపై వైసీపీ ఆధిపత్యం చూపడం ఖాయం. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో, కోట్లను క్రాస్ ఓటింగ్ ముంచుతుందో లేదా తేల్చుతుందో ? చూడాలి.