ఎదురూచూపులు తప్పవా..? ( కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎదురూచూపులు తప్పవా..? ( కృష్ణాజిల్లా)

ఉయ్యూరు, మే 5 (way2newstv.com):
రాష్ట్రంలోనే అత్యధిక క్రషింగ్‌ చేసిన చక్కెర కర్మాగారం ఈ సీజన్‌లో రైతులకు భారీగా బకాయి పడింది. రెండున్నర దశాబ్దాలుగా ఎలాంటి బకాయిలు లేకుండా నడిచిన కేసీపీ పరిధిలో రైతులు ఈ ఏడాది బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.125 కోట్ల వరకు కేసీపీ నుంచి సొమ్ములు రావాల్సి ఉంది. 2018-19 సీజన్‌కు ఈ ఫ్యాక్టరీ 9.02 లక్షల టన్నుల చెరకు గానుగాడి రాష్ట్ర స్థాయి రికార్డు నమోదు చేసుకుంది. జిల్లాలో చెరకును ఉయ్యూరు, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాల్లో గానుగాడారు. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం కర్మాగారానికి చెరకు తోలిన రైతులకు నిర్ణీత సమయంలో విడతల వారీగా ధరను కర్మాగారం రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏళ్లతరబడి వేలాది మంది రైతులకు కేసీపీ యాజమాన్యం సకాలంలో చెల్లింపులు చేస్తూ వస్తోంది. 


ఎదురూచూపులు తప్పవా..? ( కృష్ణాజిల్లా)

అవసరం మేరకు అడ్వాన్సుల రూపంలోనూ రైతులను ఆదుకుంటోంది. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి వెనుకడుగు వంటి కారణాల వల్ల క్రషింగ్‌ ముగిసినా రైతులకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. మరో వైపు రూ.కోట్లు విలువ చేసే పంచదార గోదాముల్లో మూలుగుతోందని కర్మాగార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.2018-19 సీజన్‌కు జిల్లాలో 40 మండలాల పరిధిలో 360 గ్రామాల్లోని 20,010 మంది రైతులు 32,035 ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగుచేశారు. ఉయ్యూరు, లక్ష్మీపురం కర్మాగారాల్లో 11.81 లక్షల టన్నులు గానుగాడారు. ఉయ్యూరు కర్మాగారంలో 9.02 లక్షలు, లక్ష్మీపురం కర్మాగారంలో 2.79 లక్షల టన్నులు క్రషింగ్‌ చేశారు. ఆ రెండు కర్మాగారాల్లో 8.16 లక్షలు, 2.57 లక్షల బస్తాల పంచదార ఉత్పత్తి అయింది. ఎకరాకు సగటున 38 టన్నుల చెరకు దిగుబడి వచ్చింది. 9.5 శాతం పంచదార రికవరీ వచ్చింది. జిల్లా మొత్తంగా కేసీపీ రూ.325 కోట్లు వరకు రైతులకు చెల్లింపులు చేస్తుంది. ఈక్రమంలో ఇంకా రూ.125 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నెలకు 50 వేల బస్తాల పంచాదార మాత్రమే అమ్ముకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని యాజమాన్య వర్గాలు చెబుతున్నాయి. ప్రసుత్తం రూ.300 కోట్ల విలువైన పంచదార నిల్వలు గోదాముల్లో పడి ఉన్నాయి.