కేఈకే చెక్ పెట్టిన శ్రీదేవి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేఈకే చెక్ పెట్టిన శ్రీదేవి


కర్నూలు, జూన్ 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి 40 వేలకు పైగా భారీ మెజారిటీతో శ్యాంబాబుపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనుకున్న ఈ నియోజకవర్గంలో ఆమె కేఈ వారసుడిని ఓడించి రికార్డు సృష్టించారు. కేఈ కుటుంబానికి కర్నూలు జిల్లాలో మంచి పట్టుంది. కేఈ కృష్ణమూర్తి ఏకంగా ఆరుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన పత్తికొండ 7 వేల ఓట్లతో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు.


కేఈకే చెక్ పెట్టిన శ్రీదేవి

అయితే, రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆయన ఈసారి తన వారసుడు కేఈ శ్యాంబాబును పోటీ చేయించారు. వాస్తవానికి పోటీ చేయడం మొదటి సారే అయినా కేఈ శ్యాంబాబు రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు. గత ఐదేళ్లు తన తండ్రి మంత్రిగా ఉండటంతో శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా కొనసాగారు. నియోజకవర్గ వ్యవహారాలన్నీ కేఈ శ్యాంబాబు చూసుకున్నారు. దీంతో ఈసారి ఆయన సులువుగా విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లలో కొంత అభివృద్ధి చేయడం కలిసి వస్తుందనుకున్నారు.వైసీపీ తరపున మొదటి అభ్యర్థిగా ఏడాది క్రితమే జగన్ పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవిని ప్రకటించారు. ఆమె భర్త నారాయణరెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 31 వేల ఓట్లు సాధించి సత్తా చాటారు. తర్వాత ఆయన వైసీపీలోకి చేరి కేఈ కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ, ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దీంతో అనూహ్యగా ఆయన భార్య శ్రీదేవి తెరపైకి వచ్చారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. భర్తను ప్రత్యర్థుల చేతిలో కోల్పోయిన శ్రీదేవి పట్ల నియోజకవర్గంలో సానుభూతి బాగా పనిచేసింది. దీంతో బలమైన అభ్యర్థిగా ఉన్న కేఈ శ్యాంబాబుకు ఆమె గట్టి పోటీ ఇస్తారని ఎన్నికల ముందు అంచనాలు ఉండేవి. కానీ, కర్నూలు జిల్లాలో జగన్ ప్రభంజనం వీయడంతో ఆమె కేఈ శ్యాంబాబుపై ఘన విజయం నమోదు చేశారు. తన భర్త గెలవాల్సిన చోట ఆమె గెలిచి భర్త కలను నెరవేర్చారు. కేఈ వారసుడిని దారుణంగా ఓడించడం ద్వారా ఆమె మొదటి ఎన్నికల్లోనే సత్తా చాటారు.