టీడీపీకి తలనొప్పిగా ఇంచార్జీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీకి తలనొప్పిగా ఇంచార్జీలు


నెల్లూరు, జూన్ 7, (way2newstv.com)
ఇన్ ఛార్జిల పదవులు ఇక ఉండవు. పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ ఇన్ ఛార్జుల పదవులను రద్దు చేస్తాం” అని ఎన్నికల ఫలితాలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అనేకసార్లు టెలికాన్ఫరెన్స్ లలో చెప్పిన మాట ఇది. మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారనుకోవచ్చు. నియోజకవర్గ ఇన్ ఛార్జిల వల్లనే పార్టీకి ఇబ్బందులు తలెత్తాయని ఆయన భావించి ఉండవచ్చు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో టిక్కెట్ల విషయంలో కూడా ఇన్ ఛార్జుల ప్రెషర్ తెలుగుదేశం పార్టీ అధినేతపై ఉంది.అయితే ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడటంతో తెలుగుదేశం పార్టీ తిరిగి ఇన్ ఛార్జులను కొనసాగించాల్సి వస్తోంది. రానున్న ఐదేళ్ల పాటు నియోజవకర్గాల్లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, ప్రజా సమస్యలపై పోరాటానికి ఒక ఇన్ ఛార్జి అవసరం తప్పకుండా ఉంటుంది. 

టీడీపీకి తలనొప్పిగా ఇంచార్జీలు

అందువల్ల తిరిగి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జుల ను నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన వారినే ఇన్ ఛార్జుల కొనసాగిస్తారా? లేదా? అన్నది కూడా పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల అవసరమైన మార్పులు తేవాలని చంద్రబాబునాయుడు సయితం భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జి నియామకం కూడా తలనొప్పిగా మారింది. ఉదాహరణకు జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయిన రామసుబ్బారెడ్డి ఉన్నారు. కడప ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయిన ఆదినారాయణరెడ్డి ఉన్నారు.దర్శి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన కదిరి బాబూరావుకు ఇన్ ఛార్జి పదవిని ఇచ్చేందుకు అక్కడి నాయకులు ఒప్పుకోవడం లేదు. ఒంగోలు  ఎంపీగా పోటీ చేసిన శిద్ధా రాఘవరావుకే తిరిగి దర్శి పగ్గాలు అప్పగించాల్సి ఉంటుంది. అలాగే కనిగిరి నియోజకవర్గంలో కూడా ఇన్ ఛార్జి పదవిని కదిరి బాబూరావుకు అప్పగిస్తారా? లేక పోటీ చేసి ఓటమిపాలయిన ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తారా? అన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిల నియామకంపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఖర్చు చేసి ఓటమి పాలయిన అభ్యర్థులు మరో ఐదేళ్ల పాటు పార్టీ కోసం ఖర్చు చేయడానికి ముందుకొస్తారా? అన్నది కూడా సందేహమే. చంద్రబాబు 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జులను తన విదేశీ పర్యటన తర్వాత ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.