వజ్రాల కోసం వేటాడుతున్నారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వజ్రాల కోసం వేటాడుతున్నారు...


అనంతపురం, జూన్ 7, (way2newstv.com)
ఇప్పుడు అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు. అనంత పురం జిల్లా వజ్రకరూరు మండలంలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు దొరుకుతాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు స్థానికులు. సాధారణంగా తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే సాగే ఈ అన్వేషణ ఈసారి కాస్త ముందుగానే మొదలైంది. శని వారం రాత్రి చెదురు మదురుగా పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఆదివారం ఎండ వేడిని సైతం లెక్క చెయ్యకుండా స్థానికులు వజ్రాల కోసం వేట సాగించారు. 


వజ్రాల కోసం వేటాడుతున్నారు...
పొలాల్లో అడుగడుగూ అన్వేషించారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జాతకం మారిపోతుందని చాలా ఆశగా వెతికారు.మండల కేంద్రం వజ్రకరూరు పరిసర పొలాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. ఏటా జూన్‌ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఆదివారం సాయంత్రం భారీ గాలులతోపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రెండురోజులుగా వజ్రాల కోసం అన్వేషకుల తాకిడి పెరిగిపోతోంది. పురుషులు, మహిళలు, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెదకడంలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌ వజ్రంతో సమానంగా ఉంటాయని అంటుంటారు. దేవుడు కరుణిస్తే తమ తలరాతలు మారిపోతాయేమోనని ప్రజలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరైతే భోజనాలను కూడా అక్కడికే తెచ్చుకుంటున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు వజ్రాలకోసం వెతకడం జరుగుతూనే ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు వచ్చినప్పుడు ఒడ్డు ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తాయనే భావనతో ప్రజలు వెదుకుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నాయి.   వజ్రకరూర్ సమీపంలోని ఉయ్యాల గుట్ల , గ్యాస్ గోదాం, మక్కిరేని కుంట పొలాల్లో వజ్రాల కోసం వెతికారు. ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరిపోతాయని భావించి చీకటి పడేవరకు వజ్రాల కోసం వేట సాగించారు. ఇటీవల ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. స్థానిక వ్యాపారి వాటిని ఒక కోటి ముప్పై లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో చాలా మంది అసలు పనులు పక్కన పెట్టి మరీ వజ్రాల వేటలో పడ్డారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ వారికి కనీశం ముప్పై నుండి నలభై వజ్రాలు లభిస్తాయి . వజ్రాలు లభించినవారి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది .