డైరక్ట్ ఫైట్ కు దిగుతున్న కేశినేని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డైరక్ట్ ఫైట్ కు దిగుతున్న కేశినేని


విజయవాడ, జూన్ 11, (way2newstv.com)
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఉద్దేశ్యమేంటి? ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారా? లేక పార్టీలో తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుకు చెక్ పెట్టాలన్న యోచనలో ఉన్నారా? ఇదే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కేశినేని నాని టార్గెట్ చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది. దేవినేని ఉమామహేశ్వరరావుకు పార్టీలో సముచిత స్థానం దక్కకుండా చేసేందుకే నాని ఇలా టార్గెట్ చేశారన్న వాదన కూడా లేకపోలేదు.అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు దేవినేని ఉమ కృష్ణా జిల్లాలో రాజ్యమేలారు. ఆయన అనంతపురం జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ కృష్ణా జిల్లాలో తనకు తెలియకుండా పార్టీలో ఏ చిన్న విషయమూ జరగనిచ్చే వారు కాదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు కూడా దేవినేని ఉమకు ప్రయారిటీ ఇచ్చేవారు. 


డైరక్ట్ ఫైట్ కు దిగుతున్న కేశినేని
జిల్లాలో పార్టీ తీసుకునే నిర్ణయాలను దేవినేని కనుసన్నల్లోనే అమలుపర్చేవారు. ఎంపీగా ఉన్నప్పటికీ కేశినేని నానిని పట్టించుకునే వారు కాదు.ఒక్క కేశినేని నాని మాత్రమే కాదు జిల్లాలో అప్పటి ఎమ్మెల్యేలు అనేక మంది దేవినేని ఉమ పట్ల వ్యతిరేకతతో ఉండేవారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు సయితం దేవినేని ఉమ వ్యవహార శైలిని వ్యతిరేకించే వారు. అయితే అధిష్టానం స్థాయిలో ఉమకు పట్టు ఉండటంతో వీరి మాటలు చెల్లుబాటు అయ్యేది కాదు. ఇప్పుడు టీడీపీతో పాటు దేవినేని ఉమ ఓటమి పాలు కావడంతో ఇప్పటి వరకూ ఉగ్గబట్టుకుని ఉన్న నాని డైరెక్ట్ గా తన అసహనాన్ని బయటకు వెళ్లగక్కుతున్నారు.దేవినేని ఉమకు రానున్న ఐదేళ్లలో పార్టీలో ఎలాంటి ప్రయారిటీ ఉండకూడదన్నది కేశినేని నాని ఆలోచనలా ఉంది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కాని, రాష్ట్ర స్థాయి పదవి కాని దక్కకూడదని నాని భావిస్తున్నారు. అందుకే ఆయన దేవినేని ఉమ వల్లనే కొడాలి నాని మంత్రి పదవి దక్కిందని, ఆయన వల్లనే కొడాలి నాని గెలిచారని, టీడీపీ జిల్లాలో దారుణ ఓటమికి గురయిందన్న రీతిలో పోస్టింగ్ లు పెడుతున్నారు. దేవినేని అవినాష్ ను గుడివాడకు పంపడం వెనక కూడా ఉమ ప్రమేయం ఉండటంతో నేరుగా అనకపోయినా పరోక్షంగా ఉమపై నాని చిందులు తొక్కుతున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరీ మంచిదన్న రీతిలో నాని వ్యవహార శైలి ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే ఎవరిపైనా ఇప్పుడు చర్యలు తీసుకునే స్థితిలో పార్టీ అధ్యక్షుడు లేరన్నది వాస్తవం.