హెల్త్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్న డాక్టర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హెల్త్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్న డాక్టర్లు


అనంతపురం, జూన్ 27, (way2newstv.com)
ఎమర్జెన్సీ కేసులు పెద్దాసుపత్రులను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఏ ఆస్పత్రిలో చూసినా ఎమర్జెన్సీ వార్డులు కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు నమోదు కావడం వైద్య వర్గాలనే విస్మయపరుస్తోంది. నెల తిరిగే సరికి ఒక్కో ఆస్పత్రిలో వేలల్లో ఎమర్జెన్సీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పదకొండు బోధనాస్పత్రుల్లో సగటున గంటకు 140 మంది వరకూ అత్యవసర చికిత్సకు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర చికిత్సకు చేర్చిన పేషెంటుకు వైద్యం అందించక మునుపే మరో పేషెంటు వస్తుండటంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. 

హెల్త్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్న డాక్టర్లు

హెల్త్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్న ఈ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఐసీయూ వార్డుల్లో పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వెంటలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. గుండెజబ్బుల బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతుండగా, కార్డియాలజీ స్పెషలిస్టుల కొరత బాధితులను కలవరపెడుతోంది.  ఎమర్జెన్సీ కేసుల్లో ఎక్కువగా ప్రమాద కేసులే ఉంటున్నాయని వైద్యులు వెల్లడించారు. ఒక్క అనంతపురం జనరల్‌ ఆస్పత్రికి గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 850 మందికి పైగా వచ్చారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో నాలుగు మాసాల్లో 130 మందికి పైనే నమోదయ్యారు. మరోవైపు గుండె సంబంధిత వ్యాధులతో వస్తున్న వారు అధిక సంఖ్యలో ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాద బాధితుల నమోదులో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, గుండె జబ్బుల బాధితుల నమోదులో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పురుగుల మందు లేదా మరేదైనా విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఎమర్జెన్సీ వార్డులకు వస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకుని బాధితుల ప్రాణాలను నిలిపే 108 అంబులెన్సులను ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అత్యవసర సమయాల్లో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 438 ఉండగా, అందులో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు(ఏఎల్‌ఎస్‌) వాహనాలు 120 మాత్రమే. మిగిలినవన్నీ బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌) వాహనాలే. వీటిల్లో డీఫ్రిబులేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్‌ సిలిండర్‌ వంటి సదుపాయాలు ఉండవు.