కరీంనగర్, జూలై 24 (way2newstv.com):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పరీక్షల పర్వం పూర్తయి నెలలు గడుస్తున్నా శస్త్రచికిత్సలకు నోచుకోవడం లేదు. పేదలు వైద్యాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. శస్త్ర చికిత్సల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలందరికీ దృష్టి లోపం లేకుండా ఉండేందుకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేందుకు గతేడాది ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్ణీత సమయాలు నిర్ణయించి అన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపాన్ని బట్టి దగ్గరి, దూరపు చూపుకోసం కళ్లద్దాల పంపిణీ చేపట్టారు.
వెలుగుకు చీకట్లు.. (కరీంనగర్)
శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించారు. పరీక్షల్లో భాగంగా దగ్గరిచూపు అవసరమైన వారందరికీ పరీక్షల నివేదికల ఆధారంగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. దూరం చూపు వారి కోసం జోళ్లను తయారు చేయించి తెప్పించి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికీ 1600 మందికి ఈ కంటి అద్దాలు సరఫరా కావల్సి ఉంది.ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కంటి వెలుగు కార్యక్రమంలో 40 ఏళ్లకు పైబడిన వారిలో శస్త్రచికిత్సలు అవసరమైన వారిని జిల్లా వ్యాప్తంగా గుర్తించారు. వీరికి ప్రభుత్వ పరంగానే ఉచిత శస్త్రచికిత్సలు చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఆసుపత్రులను కేటాయించారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి చల్మెడ, ప్రతిమ వైద్య కళాశాలతో పాటు రేకుర్తి ఆసుపత్రిని కేటాయించారు. ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో లేని శస్త్రచికిత్సలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్, సరోజనీదేవి ఆసుపత్రుల్లో చేయించాలని నిర్ణయించారు. నవంబర్ వరకు జిల్లాకు చెందిన 325 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. ఆతర్వాత ఇప్పటివరకు మళ్లీ ఎవరికీ చేయలేదు. గ్రామాల్లో చాలామంది శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Tags:
telangananews