సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న గుంటూరు రాజకీయ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పొలిటికల్ ప్రస్థానం ముగిసి పోతోందా ? ఆయనకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందా ? సొంత పార్టీ టీడీపీలోనే వ్యతిరేక వర్గం తయారైందా ? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. రాజకీయంగా కోడెల కుటుంబం తాజాగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మిలు చెలరేగిపోయారు. అందినకాడికి దోచుకున్నారు. దందాలు, భూకబ్జాలు, వసూళ్ల పర్వంలో గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో వీరిపై ఆరోపణలు వస్తున్నాయి.ఇప్పటికే పదుల సంఖ్యలో కోడెల పుత్ర, పుత్రికా రత్నాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కోడెల శివప్రసాదరావు ఫ్యామిలీ కుమార్తె, కుమారుడిపై లెక్కకు మిక్కలిగా ఆరోపణలు వస్తున్నాయి.
కోడెల రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా
రోజుకో కేసు అన్నట్టుగా నమోదు అవుతోంది. వైసీపీ నేతలు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే కోడెలను ఓ రేంజులో టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోడెలకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. ఆయన నాయకత్వాన్ని స్థానిక నాయకులు సహించలేక పోతున్నారు.ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోడెల శివప్రసాదరావు గత 2014ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, తాజాగా ఆయన నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, దీనికి స్తానిక నేతలు ముందుకు రాలేదు. సరికదా.. కమిటీ సమావేశం ఎందుకు? అని ప్రశ్నించేస్థాయి వచ్చింది. ఇప్పటికే గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట స్థానం టీడీపీలోని బీసీ నాయకులు ఆక్యుపై చేశారు. అక్కడ నుంచి ఈ ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గంలో కోడెల జోక్యానికి ఆయన ఒప్పుకోవడం లేదు. దీంతో కోడెల ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చక్కపెట్టుకోవాలనుకుంటే సత్తెనపల్లి మాత్రమే ఆప్షన్‌గా ఉంది.ఇక్కడ కూడా పార్టీ నాయకులు కోడెల నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందే కోడెలకు సీటు ఇవ్వవద్దని ఆ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చివరకు కోడెల శివప్రసాదరావు బాబుపై ఒత్తిడి చేసి మరీ టిక్కెట్ దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ స్థానిక వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడుతున్నారు. కోడెలకు దాదాపుగా పార్టీలోనే ప్రాధాన్యం తగ్గే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.తన కుటుంబం చేసిన అక్రమాలను తెలిసి కూడా ఆయన నిలువరించలేక పోవడం, పైగా వాటిని సమర్ధించడం వంటి పరిణామాలు ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తున్న నేపథ్యంలో వచ్చే కోడెలకు ఆయనకు పట్టున్న రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతలే పొగ పెట్టేస్తున్నారు. ఆయన్ను అసలు టీడీపీ నాయకులు దగ్గరకు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు పొలిటికల్ ఫ్యూచర్ దాదాపు ఖతమైందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.