అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి వ్యూహాత్మక చెక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి వ్యూహాత్మక చెక్


అఫెన్స్, డిఫెన్స్ లతో అసెంబ్లీ సమావేశాలు 
విజయవాడ, జూలై  30, (way2newstv.com)
అదే దూకుడు. ప్రశ్నించే ధోరణి .. పట్టుబట్టే తంతు … వైసీపీ, టీడీపీలు గత శాసనసభనే తలపించాయి. సెషన్ జరిగిన రోజులన్నీ పరిశీలిస్తే..ఒక పక్షానిది అఫెన్సివ్ అటాక్. మరొక పార్టీది ఆత్మరక్షణ వైఖరి. ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. శాసనసభ అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, దూషణలు సహజమే. అందుకే ప్రజలకు తేడా కనిపించడం లేదు. చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ బాధ్యతల్లో మార్పులొచ్చిన విషయాలను ఆయా పార్టీలే గుర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇంకా తమ రోల్స్ గుర్తించడంలో తడబడుతున్నాయి. పరిపాలనను పరుగులు తీయించడం పాలకపక్షం బాధ్యత. సర్కారు చేసే తప్పిదాలను ఎత్తి చూపించి నిలదీయడం ప్రతిపక్షం కర్తవ్యం. కానీ జరిగిన, జరుగుతున్న తీరు వేరుగా ఉంది. గత ప్రభుత్వ నిర్ణయాలను నిలదీయడమే లక్ష్యంగా ఉంటోంది అధికార వైసీపీ సభ్యుల ధోరణి. 
 అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి వ్యూహాత్మక చెక్

గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోషించిన పాత్రను స్మరించుకోవడమే కాదు చక్కగా మరోసారి నిర్వర్తిస్తున్నారు వైసీపీ నేతలు. తాము చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్టు అని పాలక పార్టీలు సమర్థించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం తమ హయాంలో సాగిన పనులన్నీ సక్రమమేనంటూ సమర్థించుకోవడానికే సమయం వెచ్చిస్తోంది. దీనివల్ల రెండు పార్టీలు తాము నిర్వర్తించాల్సిన పాత్రలకు సరైన న్యాయం చేయలేకపోయాయి.తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అధికార పార్టీకి అవసరం. ఎన్నో ఆశలతో ప్రజలు అనూహ్యమైన మెజార్టీతో వైసీపీని గద్దెనెక్కించారు. వారి అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని నిరూపించుకునేందుకు అసెంబ్లీకి మించిన వేదిక మరొకటి ఉండబోదు. తొలి బడ్జెట్ తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రవేశపెట్టుకున్న తరుణం. తాము ప్లాగ్ షిప్ కార్యక్రమాలుగా పెట్టుకున్నవాటికి విస్తృత ప్రచారం కల్పించుకునేలా అధికారపార్టీ ప్రయత్నించాలి. అయితే ఆ దిశలో కదులుతున్నట్లుగా కనిపించడం లేదు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు, విత్తనాల కొరత, కరువు తొలి సవాళ్లుగా నిలిచాయి ప్రభుత్వానికి. వాటిని పరిష్కరించుకోవడం ప్రథమ ప్రాధాన్యం. గత ప్రభుత్వం వరస తప్పిదాలు చేస్తూ రావడంతోనే ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. వాటిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తే ఫర్వాలేదు. పాత సర్కారు అంశాలే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోకూడదు. గ్రామ సచివాలయాల్లో నూతన కొలువులు, బీసీ కమిషన్, కాంట్రాక్టుల కేటాయింపునకు జ్యుడిషియల్ కమిషన్, కౌలుదారులకు ఆర్థిక సాయం వంటి నిర్ణయాలు సర్కారుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టే అంశాలు. ప్రతిపక్షం ఏరకంగా వివాదం రేకెత్తించినా తాను ప్రవేశపెట్టిన అంశాలపై పోకస్ అయ్యేలా చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పక్షానికి ఉంటుంది. లేకపోతే తప్పొప్పుల పట్టికగా చర్చలు నడిచి పోతుంటాయి. దీనివల్ల ప్రతిపక్షానికే అదనపు ప్రయోజనం.బిడ్డ చనిపోయినా పురుటి వాసన వదలలేదని సామెత. తమ సర్కారు కుప్పకూలిపోయినా ఇంకా తెలుగుదేశాన్ని గతం వెన్నాడుతోంది. 2014లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన వాగ్దానంగా నిలిచిన రైతు రుణమాఫీని పూర్తి చేయలేకపోవడం టీడీపికి ఇంకా చిక్కులు తెచ్చిపెడుతూనే ఉంది. అదే విధంగా అరకొరగా అమలు చేసిన నిరుద్యోగ భృతి, చివరి రోజుల్లో పంచిపెట్టిన పసుపు కుంకుమ, కాపు రిజర్వేషన్ల అంశం వంటివన్నీ టీడీపీ నోరు కట్టేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పదే పదే ఆయా అంశాలను లేవనెత్తింది. పోలవరం పూర్తి చేస్తామన్న వాగ్దానమూ సాకారం కాలేదు. రాజధాని విషయంలోనూ సంతృప్తిని నింపలేకపోయింది. ఫలితంగానే ప్రతిపక్షం బలహీనంగా కనిపిస్తోంది. సమర్థ వాదన వినిపించలేకపోతోంది. గోదావరి జలాల తరలింపు తెలంగాణ గడ్డపై నుంచి కాకుండా సొంతగడ్డపై నుంచి చేయాలన్న వాదన విషయంలో మాత్రమే టీడీపీ సక్సెస్ అయిందని చెప్పాలి. మిగిలిన అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే ఆత్మాశ్రయ ధోరణిలో తమపాత సర్కారు పనులకు బదులు చెప్పుకోవడానికే సమయమంతా గడచిపోయింది.వైసీపీ సర్కారుకు సామాజిక సమీకరణలన్నీ చక్కగా కలిసిరావడంతో మంచి మెజార్టీతో విజయం సాధించగలిగింది. తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ సామాజిక వర్గాలు వైసీపీని తలకెత్తుకున్నాయి. తాజాగా సామాజిక అస్త్రాన్నే ప్రభుత్వంపై ప్రయోగించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. 2014లో టీడీపీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం 2019వచ్చేనాటికి చీలిపోయింది. ఈ సామాజిక వర్గంలో మెజార్టీ భాగం జనసేనకు, మరికొంతభాగం వైసీపీకి మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం బీసీ రిజర్వేషన్ల విషయంలో మాట నిలుపుకోలేదనే భావనతో ఆపార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు కాపులు. చివరి దశలో టీడీపీ సర్కారు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల కోటాలో అయిదుశాతం కాపులకు కేటాయిస్తామంటూ తూతూమంత్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపైనా కాపులు సంతృప్తికరంగా లేరు. కానీ ఆ నిర్ణయాన్ని తిరగదోడటాన్ని మాత్రం వారు సహించలేరు. వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు చట్టబద్దం కాదంటూ నిర్ణయం తీసుకోవడం మళ్లీ కలకలం రేపుతోంది. దీనిపై న్యాయపరంగా కోర్టులు, కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకునే వరకూ సంయమనం పాటించి ఉంటే సరిపోయేది. సొంత వైఖరిని ప్రకటించడం వల్ల రాజకీయ ఉద్యమానికి ఆస్కారం కలిగించినట్లవుతుంది. వైసీపీ ప్రభుత్వానికి ఇదొక కొత్త తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.