ఆహ్లాదం కరువైంది....

అనంతపురం, ఆగస్టు 28, (way2newstv.com)
పట్టణాల్లో ఉద్యానవనాలు లేక ఆహ్లాదం కరవయింది. పురపాలక సంఘాల వద్ద ఉద్యానవనాల నిర్వహణకు నిధులు లేకపోవడంతో వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఉన్న పార్కుల నిర్వహణే పట్టించుకోకపోవడంతో నూతన ఉద్యానవనాల ఏర్పాటు అసాధ్యంగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుని కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ప్రతియేటా ఓ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని నిధులను కూడా కేటాయించింది. హిందూపురం పురపాలక సంఘంలో అమృత్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలోనే ఉద్యానవనాల అభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తున్నారు. 
ఆహ్లాదం కరువైంది....

పట్టణంలోని హౌసింగ్ బోర్డులో రూ.50 లక్షలతో అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ పార్కు పట్టణానికే నూతన శోభను తీసుకొస్తోంది. పార్కులో పచ్చిక ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. చిన్నారులకు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అంతటితో సరిపెట్టకుండా యువత కసరత్తు చేయడానికి ఓపెన్ జిమ్ పరికరాలను అమర్చారు. ప్రహరీని బలోపేతం చేసి నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పార్కులో అన్ని సౌకర్యాలు సమకూరడంతో చిన్నారులతో కిటకిటలాడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని ఇస్తోంది. పార్కులో అన్ని సౌకర్యాలు ఉండటంతో సమీప కాలనీవాసులే కాకుండా సెలవు రోజుల్లో పట్టణంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళుతున్నారు. చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులు ఉండటంతో వారిని విశేషంగా ఆకట్టుకొంది. మరో వైపు నిర్వహణలో భాగంగా మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు అన్ని చర్యలు తీసుకొంటున్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి ప్రత్యేక చొరవ చూపడంతో అద్భుతమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. రెండు, మూడు దశల్లో ఉద్యానవనాల అభివృద్ధికి నిధులు రావడంతో పట్టణంలోని ఎన్జీవో లేఔట్, డీబీ కాలనీల్లో నూతన ఉద్యానవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి పనులు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఉద్యానవనాలు అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో నిర్మించిన ఇందిరాపార్క్, కల్లూరు సుబ్బారావు ఉద్యానవనాల్లో మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులు చేపడితే మరింత శోభ చేకూరే అవకాశం ఉంది. ఈ దిశగా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Previous Post Next Post