నిర్వహణలో అప్రమత్తం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిర్వహణలో అప్రమత్తం

ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
వరంగల్, ఆగష్టు 6 (way2newstv.com):
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.  ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
నిర్వహణలో అప్రమత్తం

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి బ్యారేజి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పొడవునా చాలా దూరం  కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూలు, పసుపు, కుంకుమతో కూడిన వాయినం సమర్పించారు. అనంతరం నాణాలను నదిలోకి జారవిడిచారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుండి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు ఈ సీజన్ లో మేడిగడ్డ నుండి కిందికి ఎంత వరద వెళ్లింది అని అధికారులను అడిగారు. ఈ సీజన్ లో 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పై నుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని వీలున్నంత వరకు నదిలో నీటి మట్టాన్ని మెయిన్ టెయిన్ చేయాలని అధికారులకు సూచించారు. గోదావరిలో మొత్తం ఫ్లడ్స్ తగ్గిన తర్వాత గేట్స్ మూసివేయాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజిని సకాలంలో నిర్మించి ఈ సీజన్ కు అందించిన ఎల్ అండ్ టి సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.ఆ తర్వాత ఇటివల నిర్వహించిన యాగశాల వద్దకు చేరుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల నుండి వినతి పత్రాలను తీసుకున్నారు.ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, ఇరిగేషన్ కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ వి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఎన్సీ మురళీధర్ రావు, ఈఈ రమణ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి రాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకునే ముందు వరకు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకునే సమయంలో వర్షం తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గోలివాడకు బయలుదేరిన తర్వాత మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం కురిసింది.