మళ్లీ జనాల్లోకి అయ్యన్న పాత్రుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ జనాల్లోకి అయ్యన్న పాత్రుడు

విశాఖపట్టణం, ఆగస్టు 7, (way2newstv.com)
విశాఖ జిల్లా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జనాల్లోకి వచ్చారు. దాదాపుగా మూడు నెలల పాటు మౌన వ్రతం పట్టిన ఈ సీనియర్ మోస్ట్ లీడర్ ఇపుడు మీడియాను పలకరిస్తున్నారు. జగన్ పేరు ఎత్తితే పూనకం వచ్చేసే అయ్యన్నపాత్రుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకో ఒక్కసారిగా సైలెంట్ అయిపొయారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి సైకిల్ సవారీనే నమ్ముకున్న పెద్దాయన అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. టీడీపీలో బాబు కంటే సీనియర్నని చెప్పుకునే బాధ్యత కలిగిన అయ్యన్నపాత్రుడు పార్టీ అలా ఓడిపోగానే ఇలా నోటికి తాళం వేసేసుకున్నారు. మరి అది వ్యూహాత్మకమో, లేక మరే కారణమో తెలియదు కానీ అయ్యన్నపాత్రుడు అలికిడి పెద్దగా కనిపించలేదు ఇన్నాళ్ళు.అయ్యన్నపాత్రుడు అంటేనే మాటల దూకుడు అంటారు. 
మళ్లీ జనాల్లోకి అయ్యన్న పాత్రుడు

పిడుగులు పడ్డట్లుగా ఉంటాయి ఆయన కామెంట్స్ వింటూంటే. చీల్చిచెండాడే రకం. అటువంటి అయ్యన్నపాత్రుడు గొంతులో ఇపుడు సాఫ్ట్ స్వరం పలుకుతోంది. తన నియోజకవర్గంలో సమస్యలు తీర్చండి అంటూ జగన్ ని ఆయన కోరడం వరకూ బాగానే ఉన్నా అయ్యన్నపాత్రుడు లాంటి నేత చేయాల్సింది అది కాదు కదా, ఆయన స్టైల్ కి అది పక్కా వ్యతిరేకం కదా అని తమ్ముళ్ళు విస్తుపోతున్నారు. తనను పాతిక వేల ఓట్ల తేడాతో ఓడించిన ఒకప్పటి అనుచరుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ని కూడా అభివృధ్ధి చేయమంటూ అయ్యన్నపాత్రుడు కోరడం ఓ విధంగా మంచి పరిణామమే అనుకున్నా ఎందుకో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి అది నప్పడంలేదంటున్నారు. జగన్ పాలనపై ఓ వైపు టీడీపీ తమ్ముళ్ళు తొలి రోజు నుంచి తప్పు పడుతూ నిప్పులు కురిపిస్తూంటే మాజీ మంత్రి మాత్రం నిదానంగా మాట్లాడం విడ్డూరమే. మరి అయ్యన్నపాత్రుడు ఇలా మాట్లాడడం వెనక ఏమైనా విషయం ఉందా అన్న చర్చ ఇపుడు మొదలైంది.ఏపీలో ఎన్నడూ లేని రాజకీయ వాతావరణం ఉంది. ఈసారి ఎన్నికలు కూడా చావో రేవో అన్నట్లుగా సాగాయి. గెలిచిన పార్టీ బతికిన‌ట్లు అని రాజకీయ పండితులు కూడా ముందే జాతకం చెప్పేశారు. ఆ విధంగా చూసుకున్నపుడు టీడీపీ ఓడి పతనమైపోయిందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆ దౌట్లు అలా ఉండగానే తమ్ముళ్ళు కొంతమంది బీజేపీలోకి క్యూ కట్టేస్తూంటే మరి కొంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సీన్ మొత్తం అర్ధమైన తరువాతనే అయ్యన్నపాత్రుడు సౌండ్ మారిందని అంటున్నారు. చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు, ఇక్కడ అయ్యన్న ఏజ్ కూడా అరవైలు దాటేసింది. దాంతో ఈ ఏజ్ లో డైనమిక్ గా రాజకీయాలు చేయగలమా అన్న సందేహం వచ్చి ఉండాలి. అదే టైంలో కొడుకుని రాజకీయ వారసునిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మాజీ మంత్రి మీద ఉంది. దాంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో కానీ వైసీపీ మీద బాణాలు ఎక్కుపెట్టడంలేదని అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. అలా కనుక ఆలోచిస్తే అయ్యన్నపాత్రుడు సాఫ్ట్ వాయిస్ వెనక కూడా కధలు ఎవరికి తోచినట్లుగా వారు అల్లుకోవచ్చు.