అంతులేని అక్రమం (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతులేని అక్రమం (అనంతపురం)

అనంతపురం, ఆగస్టు 26 (way2newstv.com):
భూ ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. వంకలు, వాగులు, చెరువులనూ వదలడం లేదు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేసి, ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా నగర శివారులోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న ఎర్రవంకపై కన్నేశారు.. ఇరువైపులా వంకను పూడ్చుతూ క్రమంగా ఆక్రమిస్తున్నారు. వంక స్థలం అనేకచోట్ల కబ్జాకు గురైంది. ఈ తంతు గత నెలరోజులుగా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. మరోవైపు వంకలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు. కొందరు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం గ్రామీణం పరిధిలోని హంపాపురం నుంచి ప్రారంభమయ్యే ఎర్రవంక కందుకూరు, గంగులకుంట, ఆకుతోటపల్లి మీదుగా.. ఆర్డీటీ స్టేడియం దగ్గర ఉన్న పండమేరులో కలుస్తుంది. 
అంతులేని అక్రమం (అనంతపురం) 

ఎగువన వర్షాలు కురిసినప్పుడు ఈ వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు వంక ప్రవాహ ఉద్ధృతికి అనంతపురం - చెన్నై రహదారిపై రాకపోకలు స్తంభించేవి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మించారు. వరద ఉద్ధృతిని తగ్గించడానికి అక్కడక్కడా చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వీటివల్ల నీరు నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. ఆయా పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఎర్రవంక కనుమరుగవుతోంది. ఇటీవల వర్షాభావం నెలకొనడంతో వంకకు నీరు చేరలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కబ్జాదారులు క్రమంగా ఆక్రమించేస్తూ.. వంక రూపురేఖలనే మార్చేస్తున్నారు.కియాతోపాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వల్ల జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అనంత నగర శివారు ప్రాంతంలోనూ ఇంటి స్థలం సెంటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. చెరువులు, కాలువలు, వంకలను కబ్జా చేస్తున్నారు. వాటికి పట్టాలు సృష్టించి, సొమ్ము చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎర్రవంకను ఆక్రమించేస్తున్నారు. వంకలో వరద నీటికి అడ్డుకట్ట వేసి, భూగర్భ జలాలు పెంచేందుకు గతంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను చాలావరకూ ఆక్రమణదారులు ధ్వంసం చేశారు. చెక్‌డ్యామ్‌లకు ఇరువైపులా మట్టిని తవ్వేస్తున్నారు. కొందరు నిత్యం ట్రాక్టర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది కబ్జాదారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మట్టిని తవ్వి, తరలించేందుకు అడ్డు తగలకుండా అధికారుల చేతులు తడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరు ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో వాగులు, వంకలు, చెరువులు కనుమరుగవుతాయి. కరవుతో అల్లాడుతున్న అనంతకు నీటి వనరులే ప్రాణాధారం. వాటిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.