ఇంత అధ్వాన్నమా..? (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంత అధ్వాన్నమా..? (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 26 (way2newstv.com): 
జిల్లాలోని ప్రధాన రహదారులు మాత్రం మారుమూల పల్లెల్లోని మట్టిరోడ్ల కన్నా అధ్వానంగా తయారయ్యాయి. నిరంతరం.. నిర్విరామంగా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. వాన కురిస్తే గుంతలెక్కడున్నాయో తెలియక వాహన చోదకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి. జిల్లాలో నిరంతరం ఏదో ఒకమూల రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. మరమ్మతులు చేయాలని ప్రజలు అభ్యర్థిస్తూనే ఉన్నారు. పాలకులు, అధికారులు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు రోడ్డు నిర్మాణాలు, విస్తరణలు, మరమ్మతుల నిమిత్తం జిల్లాకు రూ.650 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇదే సమయంలో ఎన్నికల నియమావళి వచ్చింది. దీంతో రహదారుల పనులు నిలిచిపోయాయి. 
ఇంత అధ్వాన్నమా..? (పశ్చిమగోదావరి)

మంజూరైన నిధులు వెనక్కు మళ్లాయి. టెండర్లు రద్దయ్యాయి. జిల్లాలో 75 నుంచి 80 శాతం రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. గతంలో విడుదలైన నిధులతో చేపట్టిన రోడ్డు పనుల్లో కొన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి 25 శాతంలోపు పనులు చేసిన రహదారులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన 13 పనులు నిలిచిపోయాయి. అవన్నీ 5, 10, 15 శాతం పనులు జరిగినవే. ఈ కారణంగానే నిడదవోలులో రూ. 201 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఆర్వోబీ నిర్మాణం కూడా ఆగింది. ఎన్నికల ముందు విడుదలైన నిధులు వెనక్కి వెళ్లడం, ప్రాథమిక దశలో ఉన్న రోడ్ల పనులు ప్రభుత్వ నిర్ణయంతో నిలిచిపోవటంతో జిల్లాలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దీనికితోడు భారీ వర్షాలతో కొద్దోగొప్పో బాగున్న రహదారులు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి. 25 శాతం కన్నా తక్కువ నిర్మాణాలు జరిగి ప్రభుత్వ నిర్ణయంతో పనులు నిలిచిపోయిన రోడ్లకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం ఆధ్వర్యంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరిగిన పనులకు చెల్లింపులు చేసి మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కొత్తగా ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై సమీక్ష కమిటీకి ఆర్‌అండ్‌బీ నివేదికలు సమర్పించింది. కమిటీ నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందని, వెనక్కు వెళ్లిన రూ. 650 కోట్ల నిధులు కూడా తిరిగి మంజూరు చేసేలా ప్రతిపాదనలు చేశామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.