మింగేస్తున్నారు.. (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మింగేస్తున్నారు.. (నెల్లూరు)

నెల్లూరు, ఆగస్టు 26 (way2newstv.com): 
పట్టణాల పరిధిలో చెరువుల నుంచి వచ్చే పంట కాలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆక్రమణదారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. నెల్లూరు నగరం, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, ఆత్మకూరు పట్టణాల మీదుగా పంట కాలువలు విస్తరించి ఉన్నాయి. జనావాసాల మధ్య కాలువలు ఉండడంతో ఆక్రమణదారులు చొచ్చుకొచ్చి మరీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వర్షాకాలంలో నీరు సైతం ప్రవహించే వీలులేకుండా పోయింది. చాలా చోట్ల నీరు సజావుగా ప్రవహించకపోవడంతో మురుగు కాలువలుగా మారాయి. తరచూ వచ్చే వరదల కారణంగా నగరం, పురపాలక సంఘాల్లో ముంపు ఏర్పడుతుంది. నీటి పారుదల శాఖాధికారులకు పురపాలక సంఘాల్లో కాలువలు ఉన్నాయన్న ఆలోచనే లేదు. 
మింగేస్తున్నారు.. (నెల్లూరు)

పాలకులు, పురపాలక శాఖాధికారులు కుమ్మక్కు కావడంతో ఆక్రమణదారుల ఆటలు సాగుతున్నాయి.  జిల్లాలో ఏటా వర్షాకాలంలో నగర, పురపాలక సంఘాల్లోని ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.ఒకప్పటి గ్రామాలు క్రమంగా పురపాలక సంఘాలుగా మారడం, అదే రీతిలో పంట కాలువలు ఆక్రమణలకు గురికావడంతో బక్క చిక్కిపోయాయి. 2015లో కురిసిన అతిభారీ వర్షానికి ఇంచుమించు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు నీట మునిగాయి. అప్పట్లో అధికారులు, పాలకులు పరిశీలించి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో అమలు మాత్రం శూన్యం. కారణం అధికారుల నిర్లక్ష్యమే. నెల్లూరు చెరువు కింద 16 పంట కాలువలు ఉన్నాయి. సుమారు నగరంలో 50కి.మీ దూరం మేర విస్తరించి ఉన్నాయి. చెరువు నుంచి పంట పొలాల వరకు గతంలో కాలువలు ఒక్కొక్కటి 60 అడుగుల వెడల్పు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 15 నుంచి 20 అడుగులకు చేరుకున్నాయి. కాలువలకు ఇరువైపులా కొన్నేళ్లుగా ఆక్రమణదారులు కబ్జాలకు పాల్పడుతూ పెద్దపెద్ద భవంతులు నిర్మించారు. ఒక్క నెల్లూరు నగరంలోనే సుమారు రూ.800కోట్ల విలువైన పంట కాలువలను ఆక్రమించారు. 2015లో కురిసిన వర్షాలకు నగరం జలమయంగా మారింది. ఐదు రోజులపాటు నీళ్లలోనే ప్రజలు గడిపిన పరిస్థితి ఉంది. నేటికీ కాలువల దుస్థితిని పట్టించుకున్న అధికారిగానీ, పాలకులుకానీ లేరు.నేటికీ కనువిప్పు కలగలేదు.గూడూరు మున్సిపాలిటీ పరిధిలో నాలుగు కాలువలు సుమారు 5కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. నరసింగరావుపేట, పూలతోట, తూర్పువీధి, సత్రపువీధి, సనత్‌నగర్‌, ఆర్టీసీ, కలుజు ప్రాంతాల్లో కాలువల వెడల్పు 20 అడుగులకు కేవలం 5 నుంచి 10 అడుగులు మాత్రం ఉన్నాయి. మరో విచిత్రం ఏమిటంటే అధికారులు ఆక్రమణలకు గురైన ఈ కాలువల్ని పట్టించుకోకుండా వాటి స్థానంలో రూ.50లక్షలు వెచ్చించి చిన్న సైజు కాలువలుగా మార్పు చేశారంటే ఇక్కడ పరిస్థితి ఏమిటన్నది అర్థమౌవుతుంది. ఒక్క గూడూరులోనే రూ.50కోట్ల విలువ చేసే కాలువల స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి.ఆత్మకూరులో నాలుగు పంట కాలువలు సుమారు 15కి.మీ విస్తీర్ణం కలిగిఉన్నాయి. ఇరువైపులా ఆక్రమించడంతో రూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రోజురోజుకు ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడ రూ.2కోట్ల విలువైన స్థలాలు పరులపాలయ్యాయి. ఇక కావలి పెద్ద చెరువు నుంచి పంట కాలువలు ఆరు కి.మీ వరకు పొడవు ఉన్నాయి. ఇక్కడ స్థలాలకు అమితంగా డిమాండ్‌ ఉండడంతో ఇరువైపులా ఆక్రమించేశారు. కాలువల వెడల్పు 20 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 10 అడుగులకు చేరాయి. ఇక్కడ రూ.50 కోట్ల విలువైన స్థలాలను ఆక్రమించారు