సందిగ్ధంలో జీవనాడి పనులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సందిగ్ధంలో జీవనాడి పనులు

ఏలూరు, ఆగస్టు 23, (way2newstv.com)
పోల‌వ‌రం టెండ‌ర్ ప్ర‌క్రియ‌పై ముందుకు వెళ్లొద్ద‌ని జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ పై న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు మీద జ‌గ‌న్ స‌ర్కారు ఇప్పుడు ఏమ‌ని స్పందిస్తుంద‌ని ప్ర‌శ్నించారు? ఇప్ప‌టికే చాలా ఆలస్య‌మైంద‌నీ, పోల‌వ‌రం ప‌నుల్లో మ‌రింత జాప్యానికి ఇది కార‌ణం కాబోతుంద‌నీ, మొత్తం పోల‌వ‌రం ప‌నుల మీదే దీని ప్ర‌భావం ఉంటుంద‌న్నారు. పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌యోగాలు వ‌ద్దు అని తాము ముందు నుంచీ చెబుతున్నామ‌నీ, ఒక‌సారి ఏదైనా ఎక్క‌డైనా తేడా వ‌చ్చి ప‌నులు ఆగిపోతే అవి పునః ప్రారంభం కావ‌డం అంత సులువైంది కాద‌న్నారు. 
సందిగ్ధంలో   జీవనాడి పనులు

తాము ఎంత చెప్పినా రాష్ట్ర ప్ర‌భుత్వం మూర్ఖంగా ముందుకెళ్లింద‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో ఏదో అవినీతి జ‌రిగిందనే లేనిపోని అనుమానాల‌తో, లేని అవినీతిని ఉంద‌ని నిరూపించ‌డం కోసం జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నించింద‌ని చంద్ర‌బాబు అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నీ, ఆల‌స్య‌మౌతున్న కొద్దీ చాలా ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కేంద్ర‌మంతి నితిన్ గ‌ట్క‌రీ త‌న‌కు చెప్పేవార‌ని చంద్ర‌బాబు నాయుడు గుర్తుచేశారు. ఒక్క‌సారి న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్యలూ వివాదాలూ అంటూ మొద‌లైతే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు అనుకున్న స్థాయిలో ముందుకెళ్ల‌వ‌ని గ‌ట్క‌రీ సూచించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌భుత్వానికి పిచ్చి ప‌ట్టిందేమో అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు! ఏ ప్రాజెక్టు అయినా న్యాయ‌ప‌ర‌మైన వివాదాల్లో చిక్కుకుంటే ఏళ్ల త‌ర‌బ‌డి ముందుకు సాగ‌ని ప‌రిస్థితి ఉంటుంద‌నేది వాస్త‌వం. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో కేంద్రం నుంచి సాయం ఆశించినంత‌గా అంద‌క‌పోయినా, రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చొర‌వ చూపి ప‌నులు ఆగ‌కుండా చూసుకుంది. కేంద్రం నుంచి కొర్రీలు వ‌స్తున్నా, బిల్లుల చెల్లింపుల్లో జాప్య‌మున్నా కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌నులు జ‌రుగుతూనే ఉండేవి. ఓప‌క్క ఎన్డీయేతో రాజ‌కీయ వైరం కొన‌సాగించినా… కేంద్ర‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీతో స‌యోధ్య కొన‌సాగిస్తూ ప్రాజెక్టును ముందుకు లాక్కెళ్లే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు నాయుడు చేశారు. అయితే, ఇప్పుడు ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో కేంద్రం కూడా వైకాపా స‌ర్కారు తీరును త‌ప్పుబ‌డుతున్న ప‌రిస్థితి ఉంది! ఢిల్లీ నుంచి సాయం ఇప్పుడు రాదు. పోనీ, రాష్ట్ర‌మే చొర‌వ తీసుకుని ముందుకెళ్తుందా అంటే… రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటూ వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే, ఇప్పుడు కోర్టు ఆపింది! ప్ర‌స్తుతానికైతే పోల‌వ‌రం ప‌రిస్థితి సందిగ్ధంలో ప‌డింద‌నే అనిపిస్తోంది.