ఏపీ వ్యాప్తంగా 470 మందు షాపులు షురూ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ వ్యాప్తంగా 470 మందు షాపులు షురూ...

విజయవాడ, సెప్టెంబర్ 4, (way2newstv.com)
రాష్ట్రంలో 470 ప్రభుత్వ మద్యం దుకాణాలు  ప్రారంభమయ్యాయి.  వాస్తవానికి 504 మద్యం దుకాణాలు ప్రారంభించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ షాపులు ఏర్పాటుచేసే ప్రదేశాలపై అభ్యంతరాలు, వర్షాల కారణంగా 34 షాపులను ప్రారంభించలేదు. రెండు, మూడు రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు ఎక్సైజ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రారంభమైన మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు, సమయ పాలన వివరాలు, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి నినాదాలతో బ్యానర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
ఏపీ వ్యాప్తంగా 470 మందు షాపులు షురూ...

మరోవైపు.. ఈ నెలాఖరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది.అక్టోబర్‌ 1 నుంచి మొత్తం 3,500 మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవనున్నాయి. ప్రస్తుతమున్న 4,380 మద్యం షాపుల్లో 20 శాతం దుకాణాలను తగ్గించి 3,500 షాపులు మాత్రమే ఇకపై నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెల్టు షాపులపై ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపి మూడు నెలల్లో 2,500 కేసులు నమోదు చేసింది. కాగా, ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇకపై ఒకొక్కరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే విక్రయించనున్నారు. ఇప్పటి వరకు  ఆరు మద్యం బాటిళ్ల వరకు విక్రయించేందుకు అనుమతి ఉండగా,  దీనిని సగానికి తగ్గించేందుకు ఎక్సైజ్‌  శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మరోవైపు.. మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.