సిక్కోలులో తమ్మినేని ఒంటరిపోరే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలులో తమ్మినేని ఒంటరిపోరే...

శ్రీకాకుళం, సెప్టెంబర్ 4, (way2newstv.com)
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒంటరి పోరాటం చేస్తున్నారనుకోవాలి. ఆయన గెలిచిన వైసీపీ ఏపీలో అధికారం చలాయిస్తోంది. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయం కుటుంబం చేతిలో మంత్రి పదవి ఉంది. అయినా మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ విషయంలో తమ్మినేని సీతారాం స్పీకర్ మర్యాదను కూడా పక్కన పెట్టి ఫక్తు పొలిటీషియన్ గా మాట్లాడాల్సివస్తోంది. ఆయన మీద మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు డైరెక్ట్ గా బాణాలు వేస్తూంటే తోడుగా ఉండాల్సిన ధర్మాన సోదరులు చోద్యం చిత్తగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇది చాలు వైసీపీ మూడు నెలల్లో శ్రీకాకుళంలో ఎంతలా గ్రాఫ్ తగ్గించుకుందో చెప్పడానికి. స్పీకర్ రాజ‌కీయాలకు అతీతంగా ఉండాలి. కానీ తమ్మినేని సీతారాం తన రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. 
సిక్కోలులో తమ్మినేని ఒంటరిపోరే...

తన మీదకే మాజీ ఎమ్మెల్యేని ఉసిగొల్పిన శక్తుల మీద ఆయన పార్టీ లోపలా, బయటా కూడా పోరాడుతున్నారు.శ్రీకాకుళంలో సోలో మంత్రిగా ధర్మాన క్రిష్ణదాస్ ఉన్నారు. ఆయన మౌన ముని అవతారం ఎత్తేసి మూడు నెలలు అయింది. ఆయన ఇంకా తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అనుకుంటున్నారో లేక, ఓడిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నానని భావిస్తున్నారో తెలియదు కానీ సిక్కోలు జిల్లా రాజకీయాన్ని ఒడిసిపట్టడం మాట దేముడెరుగు కోరి మరీ టీడీపీకి దాసోహం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సాక్ష్తాత్తూ తన జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే అధికారులను దుర్భాషలాడడం, ప్రభుత్వ ఆఫీసుకే వచ్చి బెదిరించడం, మందీ మార్బలంతో హల్చల్ చేయడం జరిగాక మంత్రిగా దూకుడు చూపించాల్సిన దాసన్న అసలు తనకు సంబంధం లేనట్లుగా పెదవి విప్పడంలేదని వైసీపీ శ్రేణులు మధన పడుతున్నాయి. అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నాయి. తమ్మినేని సీతారాంకు అండగా కూడా నిలబడటం లేదు.ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీ నుంచి దూకుడు చేసే అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ఇంకా తానే అధికారంలో ఉన్నట్లుగా రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కట్టడి చేయాల్సిన దాసన్న మాత్రం మొహమాటాలకు పోతూ తనను తాను తగ్గించేసుకుని పార్టీని కూడా తగ్గించేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో అచ్చెన్నపై క్రిమినలు కేసులు పెట్టాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చర్యలకు తమ్మినేని సీతారాం పట్టుపడుతూంటే అధికారంలో ఉన్న మంత్రి మాత్రం పెద్దగా స్పందన లేకుండా ఉండడం సిక్కోలు వైసీపీ వర్గ పోరును బహిర్గతం చేస్తోంది. అచ్చెన్న మీద పోటీ చేసి ఓడిపోయిన టెక్కలి వైసీపీ ఇంచార్జి పేడాడ తిలక్ సైతం గట్టిగా గర్జిస్తున్నా కూడా ధర్మాన సోదరుల్లో మాత్రం చలనం లేకుండా పోతోందని అంటున్నారు. ఈ లోపాయికారి రాజకీయాలతో ఫ్యాన్ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నారన్న మాటలు పార్టీ నుంచే వినిపిస్తోంది మరి.